అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్‌కు ఓటేయండి: సీఎం కేసీఆర్

130
kcr cm
- Advertisement -

నాగార్జునసాగర్ అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్‌కు ఓటేయాలన్నారు సీఎం కేసీఆర్. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియాలో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ సభా జరగవద్దని ప్రతిపక్షాలు చేయని కుట్ర లేదన్నారు. ఎన్నికలు రాగానే ఆగం ఆగం కావొద్దూ….మంచి చేసే వారిని సమర్ధిస్తేనే మంచి జరుగుతుందన్నారు. గాడిదకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే రావన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందు ఉందన్నారు. ఎవరు గెలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో మీకు తెలుసన్నారు. నోముల నర్సింహయ్య మరణం తనను బాధించిందన్నారు. అందుకే ఆయన తనయుడు భగత్‌కు టికెట్ కేటాయించామని…ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

భగత్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని…నెల్లికల్ లిఫ్ట్ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే వరకు నందికొండ మున్సిపాలిటీ ఓ అనాథలా మిగిలిపోయిందన్నారు. కానీ టీఆర్ఎస్ గెలిచిన తర్వాత నందికొండ అభివృద్ధి చెందిందని…స్ధానికంగా ఉన్న భూసమస్యను తానే పరిష్కరిస్తానని చెప్పారు.

నందికొండకు డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని ప్రకటించారు. జానారెడ్డి 30 సంవత్సరాల కాలంలో ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదన్నారు. ఎవరేం చేశారో ప్రజలు ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇచ్చారని ఎవరో ఇస్తే రాలేదన్నారు. స్వరాష్ట్రంలో అహోరాత్రులు కష్టపడి అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టామన్నారు సీఎం. జానారెడ్డి ఏనాడూ తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించలేదన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైందని…మంచి చేసే వారిని ఆదరించి గెలిపించి మంచి జరుగుతుందన్నారు. గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ అనాథలాగా ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. త్వరలో 3 లక్షల మందికి గొర్రెల పంపిణీ చేపడతామన్నారు. నియోజకవర్గానికి చెందిన కడారి అంజయ్య,కోటిరెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

- Advertisement -