ప్రపంచంలో ఎక్కడా రైతువేదికలు లేవని..జనగామ జిల్లాలో రైతు వేదికలను ప్రారంభించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు సీఎం కేసీఆర్. కొడకండ్ల రైతు వేదికను ప్రారంభించిన అనంతరం రైతులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన సీఎం కేసీఆర్….ఇవాళ చాలా సంతోషంగా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేదని…కేవలం ధాన్యం కొనుగోలు చేస్తున్న ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.
వడ్ల కొనుగోలుపై ఎఫ్‌సీఐ కఠిన ఆంక్షలు విధించిందన్నారు.రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 95 శాతం రైతు వేదికల నిర్మాణం జరిగిందన్నారు. కరోనా రావడంతో గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు.
రైతు బంధు కమిటీలు రైతులు పండించిన ధాన్యానికి ధర నిర్ణయించాలన్నారు. రైతు వేదికలు కట్టించడం గొప్ప కలన్నారు. రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దేశంలో 24 గంటల పాటు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేసీఆర్ బతికుండగా రైతు బంధు ఆగదని మరోసారి స్పష్టం చేశారు సీఎం.
రైతులు బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని…భూమి విషయంలో రైతులకు హక్కు రావాలనే ధరణి పోర్టల్ తీసుకొస్తామన్నారు. కొద్దిరోజుల్లో సమగ్ర భూసర్వే ప్రారంభంకానుందన్నారు. రైతు సోదరుల కోసమే ఈ సర్వే చేస్తున్నామని తెలిపారు. రైతులు సంఘటితం కావాలని….దీని ద్వారా రైతులందరికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.