టీ హబ్-2 ఫెసిలిటీ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. టీ హబ్-2 ప్రాంగణాన్ని పరిశీలించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. యూనికార్న్ వ్యవస్థాపకులు, ప్రముఖ అంకుర సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, టీ హబ్ నేషనల్ రోల్ మోడల్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ స్టార్టప్ పాలసీ స్పష్టంగా ఉందని ఆయన వెల్లడించారు. టీ హబ్ స్థాపించాలనే ఆలోచనకు ఎనిమిదేళ్ల కిందే అంకురార్పణ జరిగిందన్నారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తెలుపాలని టీ హబ్ ప్రారంభించినట్లు చెప్పారు.
2015లో మొదటి దశ టీ హబ్‌ను ప్రారంభించామని వెల్లడించారు. ఏడేళ్ల తర్వాత టీ హబ్ రెండో దశ ప్రారంభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఏడేళల్లో టీహబ్ ద్వారా 1200 అంకురాలకు సహకారం అందించినట్లు చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థకు అంకురాలు దోహదం చేస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. టీ హబ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు అధికారులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కేసీఆర్ వెంట ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.