కేంద్ర ప్రభుత్వం తీరుపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి..

87
- Advertisement -

వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారత దేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ ముందస్తు ఏర్పాట్ల సన్నద్ధతపై ఈ రోజు సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన వరి ధాన్యం సేకరణ పురోగతిపై అధికారులను సీఎం ఆరాతీసారు.

ఆరుగాలం కష్టించి పనిచేస్తున్న దేశ రైతాంగాన్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచే చర్యలు చేపట్టడం, దేశంలో పంటల దిగుబడిని పెంచే దిశగా కాకుండా ఉత్పత్తిని తగ్గించే విధంగా అపసవ్య విధానాలను అమలు చేస్తుండడం బాధాకరమని సీఎం అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తూనే ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. వానాకాలం మరికొద్ది నెలల్లో రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి, అధికారులకు సీఎం సూచించారు. పత్తి, మిర్చి, కంది, వాటర్ మిలన్ తదితర ప్రత్యామ్న్యాయ పంటల సాగును ప్రోత్సహించాలని సీఎం అన్నారు.

- Advertisement -