గోరెటి వెంకన్న పాట వినండి: కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్

164
kcr
- Advertisement -

ప్రగతిభవన్‌లో తనను కలిసిన గ్రేటర్ హైదరాబాద్‌ కొత్త మేయర్, డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్‌ కార్పొరేటర్లకు అభినందనులు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్.. పలు కీలక సూచనలు చేశారు. గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరెటి వెంకన్న పాట వినండి. నేను వంద సార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించాలి. వారి బాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలి. బస్తీ సమస్యలు తీర్చాలి. అదే ప్రధాన లక్ష్యం కావాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.

హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్ ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింథ్ కాలనీ ఉంది. గుజరాతి గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాళీలున్నారు. మార్వాడీలున్నాయి. ఖాయస్తులున్నారు. ఇలా విభిన్న ప్రాంతాల వారు, విభిన్న మతాల వారు, విభిన్న సంస్కృతుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియాలాగా ఉంటుంది. అందరినీ ఆదరించే ప్రేమగల్ల నగరం. ఇంత గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల మీద ఉన్నది. మీరు గొప్పగా పనిచేసి ఈ నగర వైభవాన్ని పెంచాలి. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలి. ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. వాటికి సహకరించాలి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్ గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలిఅని సిఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ కె.కేశవ రావు, రాజ్యసభ సభ్యులు శ్రీ సురేష్ రెడ్డి,సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, ఐకె రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -