ఇది చారిత్రాత్మక నిర్ణయం- సీఎం కేసీఆర్

147
kcr cm
- Advertisement -

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం అన్నారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగేది. ఇప్పుడు కోటి పది లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. సాగునీటి వసతి పెరగడం వల్లే ఇది సాధ్యమైంది. కోటి 25 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే వ్యవస్థ సిద్ధమవుతున్నది. బోర్ల ద్వారా సాగయ్యే భూమి దీనికి అదనం. సాగునీరు అందించడంతో పాటు మిషన్ భగీరథకు కావాల్సిన నీరు, పరిశ్రమలకు నీరు అందించే బాధ్యత కూడా నీటి పారదుల శాఖకే ఉందని సీఎం తెలిపారు.

దీంతో నీటి పారుదల శాఖ ప్రాధాన్యం, పరిధి ఎంతో పెరిగింది. సాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి నీటి పారుదల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఆయా ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, చెరువులు, తూములు, చెక్ డ్యాములు, ఆనకట్టలు, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా ఒకే సిఇ పరిధికి తేవడం జరిగింది. డిఇఇ స్థాయి నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ స్థాయి వరకు ప్రతీ అధికారికి నిర్ధిష్టమైన ఆర్థిక అధికారాలను ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యవసరమైన, తక్కువ వ్యయంతో కూడిన పనుల కోసం స్థానిక అధికారులే మంజూరు చేసి, పనులు నిర్వహించే అధికారం ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో మరెక్కడా ఈ విధానం లేదు.

ఇంజనీర్ ఇన్ చీఫ్ (జనరల్)కు ఒక్కొక్క పనికి 1 కోటి మించకుండా సంవత్సరానికి 25 కోట్ల రూపాయల వరకు, చీఫ్ ఇంజనీర్(సి.ఈ.)కు ఒక్కొక్క పనికి 50 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 కోట్ల వరకు, పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్.ఈ )కు ఒక్కొక్క పనికి 25 లక్షలు మించకుండా సంవత్సరానికి 2 కోట్ల వరకు, కార్యనిర్వాహక ఇంజనీర్(ఇ.ఇ.)కు ఒక్కొక్క పనికి 5 లక్షలు మించకుండా సంవత్సరానికి 25 లక్షల వరకు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్(డి. ఇ. ఇ.)కు ఒక్కొక్క పనికి 2 లక్షలు మించకుండా సంవత్సరానికి 5 లక్షల వరకు ఆర్థిక అధికారాలను ప్రభుత్వం ఇచ్చింది.

దీన్ని సద్వినియోగం చేసుకుని చిన్న చిన్న పనులను వెంటనే పూర్తి చేసుకోవాలి. రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా సాగునీరు అందించాలి అని సిఎం కేసీఆర్ కోరారు. నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఇటీవల పునర్వ్యవస్థీకరించింది. ఈ విభజన, ఆయా అధికారులకు నిర్ణయించిన పరిధి సౌకర్యవంతంగా, పనులు చేయడానికి అనువుగా ఉందో లేదో అనే విషయంలో ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. అవసరమైన పక్షంలో మార్పులు చేయాలి’’ అని సిఎం అధికారులను ఆదేశించారు.

- Advertisement -