తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై ఇవాళ రివ్యూ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్‌లో నిర్వహించే సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల తాజా పురోగతిపై సమగ్ర నివేదికను అడిగి తెలుసుకోనున్నారు కేసీఆర్.
ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతోపాటు సీతారామ ఎత్తిపోతల పథకం త్వరితగతిన పూర్తిచేసే అంశాలను వివరించనున్నారు. ఇప్పటివరకు కాళేశ్వరం కార్పొరేషన్‌కు సుమారు రూ.33 వేల కోట్ల రుణాలు మంజూరుకాగా.. దాదాపు రూ.22,800 కోట్ల వరకు రుణం విడుదలైంది. సుమారు రూ.22,793 కోట్ల వరకు ఖర్చయింది. కార్పొరేషన్‌కు రుణాలిచ్చే బ్యాంకు కన్సార్షియాలు 80 శాతం రుణం మంజూరు చేస్తే.. ప్రభుత్వపరంగా 20 శాతాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూ.1280 కోట్ల మేర ఇస్తే మరో రూ. 5వేల కోట్ల వరకు వెంటనే రుణం వచ్చే అవకాశముంది.
ఖమ్మం జిల్లాలో నిర్వహించ తలపెట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం పనులను అడిగితెలుసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుతోపాటు దేవాదుల, తుపాకులగూడెం వంటి ప్రాజెక్టులను కలిపి గతంలోనే ప్రభుత్వం కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో కార్పొరేషన్‌కు ఎంత మేర రుణాలొచ్చాయి? ఇంకా ఎంత రావాలి? సీతారామ యుద్ధప్రాతిపదికన పూర్తయ్యేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైనా సీఎం కేసీఆర్ అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు.