అడవుల పరిరక్షణపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు..

41
kcr

శనివారం ప్రగతి భవన్‌లో పోడు సమస్యలు, హరితహారం అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోడు సమస్యలు పరిష్కరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూనే, అటవీ భూములను రక్షిస్తూ వాటిని దట్టమైన అడవులుగా పునరుజ్జీవింప చేయాలని అధికారులను ఆదేశించారు.అడవి మీద ఆధారపడి బతికే అమాయకులైన గిరిజనులకు మేలు చేయడంతో పాటు అడవులను నాశనం చేసే శక్తులను గుర్తించి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, అటవీ, పోలీస్ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆశించిన విధంగా పని చేస్తున్న జిల్లాల కలెక్టర్లు అటవీ భూముల రక్షణలోనూ కీలక భూమిక పోషించాలని సీఎం సూచించారు.అడవుల రక్షణలో అన్ని స్థాయిల్లోని సంబంధిత శాఖల అధికారులతో పాటు, గ్రామ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని చెప్పారు. పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ – పునరుజ్జీవం, హరితహారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతీ రాథోడ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు తదితరులు పాల్గొన్నారు.