తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి, లాక్‌డౌన్ అమలు, పంటల కొనుగోళ్లు, పేదలకు అందుతున్న సాయం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజలు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
ఎవరికి కరోనా లక్షణా లు కనిపించినా పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పాజిటివ్ వచ్చినవారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? అనే వివరాలు సేకరించి, వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించి, పరీక్షలు చేసే ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుంది. ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. ఇది వారికోసం, వారి కుటుంబసభ్యుల సంక్షేమంకోసం చెప్తున్న మాటలు. ప్రజలు నిరంతర అప్రమత్తంగా ఉంటూ, ఇండ్లకు పరిమితమైతేనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ప్రజలు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక సామాజిక దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. కరోనా వ్యాప్తి నివారణ అన్నది కేవలం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మాత్రమే సాధ్యం కాదన్నారు.