ముంపు ప్రాంతాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష.

27
kcr review
- Advertisement -

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్ర‌మంలో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కాలేరు వెంకటేష్, హర్షవర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, విద్యుత్, ఆర్ అండ్ బి, జీహెచ్ఎంసీ, మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తక్షణ రక్షణ చర్యలను కొనసాగించాలని…. వరదల వల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంత మేర నివారించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నది హెచ్చరికలు దాటి ప్రవహిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఎస్సారెస్పీ వంటి పెద్ద రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోల నీటి వివరాల గురించి సీఎం ఆరా తీశారు. ఇరిగేష‌న్ అధికారుల‌కు కేసీఆర్ త‌గు ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలను సీఎం ఆరా తీశారు. ఎగువ గోదావరి నుంచి వరదను అంచనా వేసి చర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు ఎప్పటికప్పుడే ఫోన్‌లోనే సీఎం ఆదేశాలు ఇస్తున్నారు. వరదల వల్ల రవాణా, విద్యుత్ త‌దిత‌ర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న చ‌ర్య‌ల‌ను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు చేసుకోవాలని విద్యుత్ శాఖ సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, సింగరేణి సిఎండీ శ్రీధర్‌ల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు 2300 వరకు విద్యుత్తు స్థంభాలు కూలిపోతే 1600 వరకు పునరుద్దరణ చేపట్టామని, మిగతా పునరుద్దరణ పనులు పురోగతిలో ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. విద్యుత్‌కు అంతరాయాలు ఏర్పడ్డ చోట తక్షణమే ప్రత్యామ్నాయ సౌకర్యాల ద్వారా విద్యుత్‌ను పునురుద్దరిస్తున్నట్టు సీఎం కేసీఆర్‌కు సీఎండీ రఘురామారెడ్డి వివరించారు.

గోదావ‌రి న‌దిపై ఉన్న క‌డెం ప్రాజెక్టులోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఈ నేప‌థ్యంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నా.. ఇంకా వ‌ర‌ద తీవ్రత పెరుగుతుంద‌ని సీఎంకు అధికారులు వివ‌రించారు. క‌డెం ప్రాజెక్టు కింద 12 గ్రామాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఉండి ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి త‌గు ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్‌తో పాటు వ‌ర‌ద ముంపున‌కు గుర‌వుతున్న ఇత‌ర ప్రాంతాల‌ను గుర్తించాలని సీఎం ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ, రాష్ట్ర రహదారుల పునరుద్దరణకు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. ఎక్కడా కూడా ప్రాణహాని జరగకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎస్, ఇరిగేషన్ అధికారులు, జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు సీఎం ఆదేశాలిచ్చారు. భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సూచించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో ముంపున‌కు గురైన పంట‌లు, చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితి గురించి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కేసీఆర్ సమీక్షించారు. వరదలు తగ్గగానే వెంటనే కావాల్సిన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.

వానలు, వరదల నేపథ్యంలో చేపట్టిన రక్షణ చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీల‌ను సీఎం ఆదేశించారు. వరద ముంపు అధికంగా వున్న జిల్లాల‌ మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులు చక్కబడేవరకు వారి వారి నియోజకవర్గాలు, జిల్లాలు విడిచి వెళ్ల‌రాదని మరోమారు సంబంధిత జిల్లాల మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వానలు, వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్పితే ప్రజలెవరూ కూడా బయటకు వెళ్లొద్ద‌ని కేసీఆర్ విజ్జప్తి చేశారు.

- Advertisement -