నాటి ఆదిమానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేలకు స్వంతమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని సీఎం స్మరించుకున్నారు.
నాటి ప్రాచీన భారతదేశంలో ఆవిర్భవించిన షోడశ (16) మహాజనపథాల్లో, దక్షిణ భారతదేశంలో విలసిల్లిన ఒకే ఒక జనపథమైన అస్మక మహాజనపథం తెలంగాణ ప్రాంతంలో నేటి బోధన్ (నాటి పౌధన్య పురం) కేంద్రంగా వెలుగొందడం తెలంగాణ గడ్డకున్న ప్రాచీనతను, ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుతున్నదని సీఎం అన్నారు.
శాతవాహన వంశం నుంచి మొదలు అసఫ్ జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేశాయని, ఇక్కడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, ఆయుధాలు, ఆభరణాలు, గుహ చిత్రలేఖనాలు, బొమ్మలు, కట్టడాలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు, భాష, యాసలు, సాహిత్యం, కళలు వారసత్వ సంపదకు ఆలవాలమని సీఎం అన్నారు.45 వేల ఏండ్లక్రితమే తెలంగాణ నేలమీద మానవ సంచారం సాగిందనడానికి నేటి జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని పాండవుల గుట్టలో లభ్యమైన ప్రాచీన మానవుని పెయింటింగ్స్ నిదర్శనమని సీఎం అన్నారు.
Also Read:తల్లి కాబోతున్న ఇలియానా..!
జైన, బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గోల్కొండ కోట, పాండవుల గుట్ట, పద్మాక్షి గుట్ట, మెదక్ చర్చి, మక్కా మసీదు, చార్మినార్ వంటి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు, సహజ నిర్మాణాలు తెలంగాణ చారిత్రక, వారసత్వ వైభవాన్ని, వైవిధ్యతను చాటుతున్నాయని సీఎం తెలిపారు.
కాకతీయుల కాలంలో నిర్మించిన ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని, ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం తెలంగాణ ప్రజలకు, దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. దీంతో పాటు దోమకొండ కోటకు యునెస్కో ఆసియా – పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు, కుతుబ్‌షాహి టూంబ్స్ కాంప్లెక్స్‌లోని మెట్లబావికి యునెస్కో అవార్డు వంటి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిస్తూ ఘనమైన తెలంగాణ వారసత్వం, ప్రపంచ వారసత్వ సంపదగా వెలుగులోకి వస్తున్నదని సీఎం అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా ఖిలా వరంగల్ కోట ఆధునీకరణ, చార్మినార్, మక్కా మసీదు వంటి గొప్ప గొప్ప ప్రాచీన కట్టడాలకు మరమ్మతులు, మొజంజాహి, మోండా మార్కెట్ల అభివృద్ధితో పాటు మరెన్నో కట్టడాలు, ప్రాచీన నిర్మాణాలకు ప్రభుత్వం మరమ్మతులు చేపడుతున్నదని సీఎం అన్నారు.ఇటీవలే 300 ఏళ్ళ ప్రాచీనమైన బన్సీలాల్ పేట మెట్ల బావితో సహా మరో ఆరు మెట్ల బావులను పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న కాలంలో మరిన్ని బావులను గుర్తించి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
నాటి ఉమ్మడి పాలనలో విస్మరించబడిన తెలంగాణ చారిత్రక సంపదను, వారసత్వాన్ని, తెలంగాణ గత ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని పునరుజ్జీవింపచేసి భావి తరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. ఈ దిశగా రాష్ట్ర పురావస్తు, సాంస్కృతిక, పర్యాటకశాఖల కృషిని సీఎం అభినందించారు. ఈ దిశగా తెలంగాణ చరిత్రకారులు, మేధావులు స్వచ్ఛందంగా కొనసాగిస్తున్న కృషి అభినందనీయమని సీఎం అన్నారు. తెలంగాణ చరిత్రను కాపాడుకోవడంలో తెలంగాణ పౌరులు, చైతన్యవంతమైన యువత భాగస్వామ్యం మరింతగా పెరగాలని సీఎం ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
Dandasana:సులభమైన ఆసనం.. ఉపయోగాలెన్నో!
IPL 2023:రైజర్స్ vs ముంబై.. ఢీ!
డయాబెటిస్‌కు ఇలా చెక్ పెట్టండి..