శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకాన్ని ఉపయోగించుకుని ఎల్లంపల్లి నుంచి వరద కాలువకు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.వరద కాలువకు నీరు అందించడానికి అవసరమైన నిల్వలు ఎస్ఆర్ఎస్పీలో లేనందువల్ల ఆయకట్లు రైతులకు ఇబ్బంది పడుతున్నారని ఉమ్మడి కరింనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించి సీఎం కేసీఆర్ వరద కాలువకు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా నిర్మించిన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాలని చెప్పారు.
ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మిపురం, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా వరద కాలువలోకి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల బాల్కొండ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్, వేములవాడ,ధర్మపురి నియోజకవర్గాల పరిదిలోని ఎస్ఆర్ఎస్పీపై ఆధారపడిన రైతులకు రబీకి నీరు అందివ్వాలని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ తెలిపారు.