కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని,ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని సిఎం సూచించారు. జూలై-ఆగస్టు మాసాల్లోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది, అది కూడా భారత్ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశం ఉందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సోమవారం దేశంలోని అందరు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. దేశంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ సరైన చర్యలు తీసుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.కరోనాపై తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశారు.
సిఎం కేసీఆర్ మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి:
– దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఉంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా బాధితులున్నారు. కాబట్టి ఇప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడిపితే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రాకపోకలు ఎక్కువగా జరుగుతాయి. ఎవరు ఎటు పోతున్నారో తెలియదు. వారికి కరోనా ఉందో లేదో తెలియదు. అందరికీ టెస్టులు చేయడం కుదరదు. రైళ్లలో వచ్చిన ప్రయాణీకులను క్వారంటైన్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రయాణీకుల రైళ్లను నడపొద్దు.
– కరోనా ఇప్పుడిప్పుడే మనల్ని వదిలి పోయేట్టు కనిపించడం లేదు. కాబట్టి కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదు. ఈ విధంగా ప్రజల్ని నడిపించాలి. ముందుగా వారిలో భయాన్ని పోగొట్టాలి. కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలి.
– కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశం నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ కు చెందిన కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ వచ్చే చాన్స్ ఉంది. జూలై-ఆగస్టు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది.
– కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. వైద్యపరంగా సర్వ సిద్ధంగా ఉన్నాం. పరికరాలు, మందులు, మాస్కులు, పిపిఇ కిట్లు, బెడ్లు.. ఇలా కావాల్సినవన్నీ ఉన్నాయి. ఏ కొరతా లేదు.
– కరోనా వల్ల ఆర్థిక సంవత్సరంపై ప్రభావం పడింది. ఆదాయాలు లేవు. అప్పులు కట్టే పరిస్థితి ఏ రాష్ట్రానికీ లేదు. కాబట్టి అన్ని రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలి. రైతుల రుణాలను ఎలాగైతే బ్యాంకులు రీ షెడ్యూల్ చేస్తాయో అలాగే రాష్ట్రాల రుణాలను రీ షెడ్యూల్ చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలి.
– ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితిని పెంచాలి.
– వలస కార్మికుల విషయంలో అన్ని రాష్ట్రాలు సానుభూతితో, మానవత్వంతో వ్యవహరించాలి. మనది సెంటిమెంటు కలిగిన దేశం. సొంతూర్లో పిల్లలను, తల్లిదండ్రులను వదిలి వచ్చారు. సొంత వాళ్లను చూసుకోవాలని వారికి ఉంటుంది. అందుకే సొంతూరు పోదామనుకుంటున్నారు. వారిని పోనివ్వకపోతే అనవసరం ఆందోళన తలెత్తుతుంది. ఒకసారి పోయి వస్తే, వారు స్థిమిత పడతారు. మళ్లీ పనిలోకి వస్తారు. శ్రామిక్ రైళ్లు వేయడం మంచి నిర్ణయం. తెలంగాణ నుంచి పోదామనుకుంటున్న వారిని పంపుతున్నం. మళ్లీ ఆ కూలీలు వస్తున్నారు. తెలంగాణ రైసు మిల్లులలో పనిచేసే బీహార్ కార్మికులు ప్రత్యేక రైలు ద్వారా మళ్లీ తెలంగాణకు వచ్చారు. వారిని మేము సాదరంగా స్వాగతించాం. వస్తారు, పోతారు. రానివ్వాలి, పోనివ్వాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
– కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అలక్ష్యం చేయవద్దు.
– పాజిటివ్,యాక్టివ్ కేసులు లేని జిల్లాలను ఆరెంజ్,గ్రీన్ జోన్లుగా మార్చమని కేంద్రాన్ని కోరుతున్నాం. అలా ప్రకటించడంలో జాప్యం జరుగుతుంది. పాజిటివ్ కేసులు లేని ప్రాంతాల్లో ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి రాగానే జాప్యం లేకుండా జోన్ల మార్పు జరగాలి.