దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో ఈరోజు సీఎం కేసీఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పథకం విధివిధానాలు, అమలు తదితర అంశాలపై వారితో చర్చించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఎస్సీల భూముల సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు.
హుజూరాబాద్‌లో ఇల్లులేని ఎస్సీ కుటుంబం ఉండకూడదని, ఇల్లులేని వారి వివరాలను గుర్తించాలని చెప్పారు. ఖాళీ స్థలముంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని చెప్పారు. ‘హుజూరాబాద్‌లో రేషన్‌కార్డులు, పింఛన్లు సహా అన్ని సమస్యలు పరిష్కరించాలి. ప్రతి ఎస్సీవాడలో అధికారులు పర్యటించాలి. వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు గుర్తించి నివేదిక ఇవ్వాలి. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి కేంద్రం, ఇతర రాష్ట్రాలు చేర్చుకుంటున్నాయి. దళితబంధు పథకాన్ని కూడా ఇతర రాష్ట్రాలు అనుసరించాలి’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.