మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సీఎం కేసీఆర్ షెకావత్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించినట్లు సమాచారం.
తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతులున్నాయి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది.