నీటి వాట కోసం కేంద్రాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు సూచించారు సీఎం కేసీఆర్. సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని ఎంపీలకు స్పష్టం చేశారు . ఈ నెల 19 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నీటి వాటాల విషయంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.
విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పెండింగు సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన సివిల్ సప్లైస్ శాఖ సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలువాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు, లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె ఆర్ సురేశ్ రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.