సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

398
kcr
- Advertisement -

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఉద్భోదించారు. విస్తృత మేథోమథనం, అనేక రకాల చర్చోప చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ- విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని, కార్యక్రమాలు తీసుకుంటుందని సీఎం అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంభిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలని చెప్పారు. ప్రగతిభవన్ లో మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రాధాన్యతలను, బాధ్యతలను వివరించారు.

ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాము. సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. రూ.40వేల కోట్లతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉండేది. చాలా తక్కువ సమయంలోనే విద్యుత్ సమస్యను అధిగమించాం. నేడు దేశంలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణం. మిషన్ భగీరథ పథకం వల్ల ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. గతంలో వేసవి వచ్చిందంటే ఎక్కడ చూసినా ప్రజలు మంచినీటికి అవస్థలు పడేవారు. మంత్రులు, కలెక్టర్ల ముందు బిందెల ప్రదర్శనలు చేసే వారు. నేడు ఆ పరిస్థితి లేదు. అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు అందుతున్నది. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగునీటి వసతి ఏర్పడుతున్నది. ఇలా ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా సాగుతున్నాయన్నారు. కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలి. ఒక టీమ్ లాగా అధికార యంత్రాంగం పనిచేయాలి. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలి. కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, కంటివెలుగు లాంటి కార్యక్రమాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాలు. ఎంతో మేధో మథనం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తుంది. అలాంటి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో కలెక్టర్లు అమలు చేయాలని చెప్పారు.

కలెక్టర్ల వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలని నిర్ణయించింది. అందుకే కలెక్టర్లకు అండగా ఉండడం కోసం అడిషనల్ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలి. కలెక్టర్లపై ప్రభుత్వం ఎంతో నమ్మకం ఉంచింది. అదే సందర్భంలో కలెక్టర్లకు ఎంతో బాధ్యత ఉంది. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్ గా వ్యవహరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మార్చాం. దీనివల్ల కొంత పనివత్తిడి తగ్గుతుంది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలి. పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచాలి. వాటిని సంరక్షించాలి. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలి. మురికి గుంటలు, చెత్తా చెదారం తొలగించాలి. పాడుపడిన బావులు పూడ్చివేయాలి. పాత బోరుబావులను పూడ్చాలి. ఈ పనులన్నింటినీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలి. గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంది. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా విభాగాలు చిన్నవి అయ్యాయి. ఇది పల్లెలను బాగు చేసుకోవడానికి ఎంతో సానుకూల అంశం. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య కాకుండా ప్రతీ నెలా రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నాం. వేరే ఖర్చులు ఆపుకునైనా సరే గ్రామాలకు నిధులు ఇస్తున్నాం. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించాం. ఎంపిఓలను, ఎంపిడివోలను, డిఎల్పివో, డిపిఓ, జడ్పీ సిఇవో లాంటి పోస్టులన్నింటినీ భర్తీ చేశాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాము. ప్రతీ గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రైబ్యునల్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం తన అధికారాలను వదులుకుని కలెక్టర్లపై నమ్మకంతో వారికి బదిలీ చేసింది. ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాద్యతను కలెక్టర్లు తీసుకోవాలి.

కలెక్టర్లకు సహాయకారగా ఉండేందుకు అడిషనల్ కలెక్టర్లను నియమించాం. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించాం. వారికి మరో పని అప్పగించవద్దు. ఒక అడిషనల్ కలెక్టర్ కేవలం స్థానిక సంస్థలను సమర్థవంతంగా పని చేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలి.రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం’ నిర్వహించాలి. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పీటిసిలను ఆహ్వానించాలి. గ్రామాలను అభివృద్ధి చేసుకునే పద్ధతి వివరించాలి. ఎవరి బాధ్యత ఏమిటో విడమరిచి చెప్పాలి. సర్పంచులు, కార్యదర్శులు ఏమేం చేయాలో వివరించాలి. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్లను ముఖ్య అతిథులుగా పిలవాలి. ఈ సమ్మేళనంలో విధులు, బాధ్యతలు చెప్పాలి. సమావేశం తర్వాత పది రోజుల గడువు ఇవ్వాలి. ఆలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఫ్లయింగ్ స్క్వాడ్ లు పర్యటిస్తాయి. ముఖ్యమంత్రిగా నేను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తాను. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి.

పల్లె ప్రగతి కార్యక్రమం కొద్ది కాలం చేసి ఊరుకునే కార్యక్రమం కాదు. కేవలం స్పెషల్ డ్రైవ్ గా కాదు, ఇది నిరంతరం సాగాలి. దేశంలో ఆదర్శ పల్లెలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలి. గ్రామాల్లో ఎవరు చేయాల్సిన పనిని వారితోనే చేయించాలి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవస్థతో పనిచేయించాలి. ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను ఖచ్చితంగా బతికించాలి. గ్రామంలో స్మశాన వాటికలు, ఖనన వాటికలు, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలి. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తివేయడానికి ట్రాక్టర్ ను కొనుగోలు చేయాలి.

గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతీ కలెక్టర్ వద్ద ఒక్కో కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచుతాము. గ్రామాల్లో మొక్కలు నాటడం మాత్రమే కాదు. అడవుల్లో కలప స్మగ్లింగును అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. చెట్లు నరకకుండా చూడాలి. అటవీ భూముల్లో దట్టమైన అడవులు పెంచాలి. పది ఎకరాల అటవీభూమిలో అడవిని అభివృద్ధి చేయడం పదివేల ఎకరాల్లో సామాజిక అడవులు పెంచడంతో సమానం. కాబట్టి అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలి.
హైదరాబాద్, గద్వాల, కరీంనగర్, జనగామ, వరంగల్ అర్బన్, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవుల శాతం చాలా తక్కువగా ఉంది. అక్కడి కలెక్టర్లు సామాజిక అడవులు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత. వారి పనితీరుకు ఇదే గీటురాయి. మొక్కలు నాటి, సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే సమస్యే లేదు. ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నారు. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటించాలి. కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలి.

పంచాయతీ రాజ్ శాఖలో దాదాపు ఖాళీలన్నీ భర్తీ చేశాము. ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం. పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తుంది. పంచాయతీ రాజ్ శాఖ మాదిరిగానే మున్సిపల్ శాఖలో కూడా అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని ఖాళీలున్నాయి. ఎక్కడెక్కడ ఏ పోస్టులు భర్తీ చేయాలో మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. రాష్ట్రంలో గతంలో కేవలం 6 మున్సిపల్ కార్పొరేషన్లుంటే, వాటిని 13కు పెంచుకున్నాం. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 128 చేసుకున్నాం. మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కూడా సమకూరుస్తాం. హైదరాబాద్ నగరానికి నెలకు రూ.78 కోట్ల చొప్పున, మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేస్తాం. ఈ నిధులతో పాటు, స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. సముద్రం ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరగడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. ఢిల్లీకి అదే సమస్య ఉంది. ఇప్పుడు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ముందున్న హైదరాబాద్ నగరాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం కాకతప్పదు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త వహించాలి. హైదరాబాద్ నగరం లోపల, చుట్టూ కలిపి లక్షా 60వేల ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో దట్టమైన అడవులు పెంచాలి. వనస్థలిపురం హరిణవనస్థలిని కేబీఆర్ పార్కులాగా తయారు చేయాలి. నగరంలో కాలుష్యం నివారించడానికి అనుగుణమైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. డిజిల్ వాహనాలు తగ్గించి, ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెంచే చర్యలు తీసుకోవాలి. ఈ నగరాన్ని కాలుష్యమయం కాకుండా చూసుకోవాలనే స్పృహ ప్రతీ ఇంటిలో కూడా కలిగించే చర్యలు తీసుకోవాలి.

అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యత విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిన తీసుకోవాలి. తమ గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలి. తమ జిల్లాను పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లాగా మార్చే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలి. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

- Advertisement -