ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేడు భేటీకానున్నారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సాయంత్రం 4:10గంటలకు సీఎం మోదీతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై ప్రధానితోపాటు కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
ముఖ్యంగా హైకోర్టు విభజనపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే హైకోర్టులో ఇరు ప్రాంతాల న్యాయవాదుల మధ్య విభజన రేఖ స్పష్టంగా వచ్చింది. హైకోర్టు విభజన కోసం ఉద్యమాలు జరిగాయి. అయితే ఏపీకి ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటుచేయాలని, అప్పుడే రాష్ట్ర విభజన సంపూర్ణం అవుతుందన్న విషయాన్ని ప్రధాని వద్ద సీఎం మరోసారి గట్టిగా ప్రస్తావించనున్నారు. దీంతోపాటు కొత్త సచివాలయ నిర్మాణం, కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల నిర్మాణానికి రక్షణశాఖ స్థలాలు ఇవ్వాలని కోరనున్నారు. రీజినల్ రింగురోడ్డుకు నిధులు కూడా కోరుతారని సమాచారం. అలాగే జోనల్ వ్యవస్థకు కేంద్ర ఆమోదాన్ని కోరనున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలని సీఎం కోరుతారని తెలుస్తోంది.
కాగా..కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ఆదివారం, మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సోమవారం ఆయన సీఎం కేసీఆర్ కలువనున్నారు.