తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండగా ప్రచారంలో గులాబీ దళం కారు జోరు పెంచింది. రాష్ట్రంలోని అన్ని లోక్ సభ నియోజకవర్గాలలో ప్రచారం సభలు నిర్వహిస్తు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచార షెడ్యూలు విడుదలైంది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4తేదీ వరకు ఆయన 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 11 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు కలిసి బహిరంగ సభ జరుగుతుంది. మండుటెండల కారణంగా ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా సాయంత్రం 4 గంటల నుంచి సభలు జరపాలని నిర్ణయించారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ కరీంనగర్, నిజామాబాద్ సభల్లో పాల్గొన్నారు. ఇవేగాక ఆదిలాబాద్ నియోజకవర్గంలో, చేవెళ్లలోని మిగిలిన భాగాలకు కలిపి మరో సభను నిర్వహించే అవకాశం ఉంది. మొదటి సభ ఈనెల 28 నుంచే సభలు జరపాలని భావించి ముసాయిదా షెడ్యూలును రూపోందించారు. దీనిపై శనివారం మంత్రులు, అన్ని జిల్లాల నేతలతో మాట్లాడిన అనంతరం తుది షెడ్యూలు ఖరారు చేశారు. 29 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
ఇక ఇదివరకే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. 26న నామినేషన్ల పరిశీలన, 28తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు మంత్రులు, శాసనసభ్యులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. అందరు కలిసి మెలిసి పనిచేయాలని, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
సీఎం కేసీఆర్ ప్రచార సభలు..