ఈరోజు సీఎం కేసీఆర్ సింగూరు ప్రాజెక్టుపై సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ చేరుకున్నారు. అనంతరం ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఎత్తిపోతల పథకాలు పూర్తయితే సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందడం ఇక ఖాయమే. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్‌లోని 11 మండలాల్లోని 231 గ్రామాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగుకు 12 టీఎంసీల నీళ్లు రానున్నాయి. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా అందోలు, నారాయణఖేడ్ నియోజకర్గాల్లోని 8 మండలాల్లోని 166 గ్రామాల్లోని 1.65 లక్షల ఎకరాల సాగుకు 8 టీఎంసీల నీటిని అందించనున్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణాల టెండర్లను మెఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకున్నది.