కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం…జాతికి అంకితమిచ్చిన సీఎం కేసీఆర్

570
kaleshwaram
- Advertisement -

తెలంగాణ ప్రజల జల కల సాకారమైంది. రైతుల కష్టాలను తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చారు సీఎం కేసీఆర్‌. గవర్నర్ నరసింహన్‌,మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌,ఏపీ సీఎం జగన్‌తో కలిసి మేడిగడ్డ బ్యారేజి వద్ద కేసీఆర్‌ ప్రాజెక్టును ప్రారంభించారు.కాళేశ్వరం శిలాఫలకాన్ని ప్రారంభించారు జగన్.అంతకముందు కాళేశ్వరం ఫోటో ఎగ్జిబిషన్,డాక్యుమెంటరీని తిలకించారు.

గేట్లు ఎత్తి బ్యారేజిని ప్రారంభించిన తర్వాత మేడిగడ్డ పంపుహౌస్‌ (కన్నెపల్లి) వద్దకు చేరుకొని అక్కడ కూడా యాగంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. యాగం తర్వాత పంపుహౌస్‌లోని మోటార్లను స్విచ్‌ ఆన్‌ చేస్తారు. అనంతరం ఈ పంపుల నుంచి నీరు బయటకు కాలువలోకి దూకే డెలివరీ సిస్టర్న్‌ వద్దకు వచ్చి పూజలు నిర్వహిస్తారు.

మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంపుహౌస్‌ ప్రారంభోత్సవ సమయంలోనే సమాంతరంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్‌లు, ఎల్లంపల్లి దిగువన ఆరు, ఎనిమిది ప్యాకేజీలలో నిర్మించిన పంపుహౌస్‌లను మంత్రులు ప్రారంభించనున్నారు.

అన్నారం బ్యారేజీని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, అన్నారం పంప్‌హౌస్‌ను హోంమంత్రి మహమూద్‌ అలీ, అంతర్గాం మండలం గోలివాడ వద్ద సుందిళ్ల పంప్‌హౌస్‌ను సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ధర్మారం మండలం నంది మేడారం పంప్‌హౌస్‌ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రామడుగు మండలం లక్ష్మీపూర్‌ పంప్‌హౌస్‌ను విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. సరిహద్దు ప్రాంతాలన్నీ ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో సుమారు 5,000 మందితో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు చేపట్టారు.

కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మూడు బ్యారేజీలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 20 లిఫ్ట్‌లు, 19 పంపు హౌస్‌లు, మొత్తం 147 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించారు. కాళేశ్వరంతో హైదరాబాద్‌ నగరం, పల్లెలకు 40 టీఎంసీల తాగునీరు,పరిశ్రమలకు 16 టీఎంసీల నీరు అందుబాటులోకి రానుంది.

- Advertisement -