దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌- సీఎం కేసీఆర్‌

202
telangana cm
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఈ పోర్టల్ ను వేదమంత్రోచ్చారణ మధ్య ముఖ్యమంత్రి ప్రారంభించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభించిన అనంత‌రం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్ర‌జ‌ల బ‌తుకంతా భూమి చుట్టూ ఉండేది. ఒక‌ప్పుడు భూమికి ప్రాధాన్య‌త ఉండేది కాదు. కానీ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో, నిర్ణీత ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌సాయం చేయ‌డం నేర్చుకున్న త‌ర్వాత భూమికి విలువ పెరిగింది. గ‌త పాల‌కులు రెవెన్యూ చ‌ట్టాలు, భూ విధానాల‌కు శ్రీకారం చుట్టారు. కొన్ని ఫ‌లితాలు ఇచ్చాయి. కొన్ని విక‌టించాయి. కొన్ని ప్ర‌జ‌ల‌కు లాభం క‌లిగించాయి. ఇబ్బందులు క‌లిగించాయి. వాట‌న్నింటికీ శాశ్వ‌త నివార‌ణ కావాల‌ని, తెలంగాణ రైతాంగం ఎలాంటి అటుపోట్ల‌కు గురికావొద్ద‌నే ఉద్దేశంతోనే కొత్త రెవెన్యూ చ‌ట్టం కోసం నిర్ణ‌యం తీసుకున్నాం. ఒక త‌ప్పు జ‌రిగితే అనేక త‌రాలు ఇబ్బంది పడుతాయి. త‌ప్ప‌ట‌డుగులు లేకుండా స‌రైన పంథాలో ముందుకెళ్లాల‌ని క‌ఠినమైన నిర్ణ‌యం తీసుకున్నాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.

స‌ంక‌ల్పం, చిత్త‌శుద్ధి ఉంటే ఏ స‌మ‌స్య‌నైనా ప‌రిష్క‌రించొచ్చు అని తెలంగాణ రాష్ర్టంలో నిరూపించామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఐదారు సంవ‌త్స‌రాల్లోనే సంక్షేమంలో, అభివృద్ధిలో దేశానికి తెలంగాణ మార్గ‌ద‌ర్శిగా నిలిచింద‌ని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ‌లో మంచినీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపిస్తామ‌ని ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ త‌ర్వాత స్వ‌యంగా తానే శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించాను. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా శాశ్వ‌తంగా మంచినీటి స‌మ‌స్య‌ను పరిష్కారిస్తామ‌ని చెప్పాను. ఆ వాగ్దానాన్ని నెర‌వేర్చామ‌ని తెలిపారు. విజ‌య‌వంతంగా మిష‌న్ భగీర‌థ ప‌థ‌కం అమ‌ల‌వుతోంది. చాలా జ‌ఠిల‌మైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించామ‌ని స్ప‌ష్టం చేశారు.

క‌రెంట్ విష‌యంలో భార‌త‌దేశంలోనే త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. 26 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి స‌బ్‌స్టేష‌న్‌, ఇత‌ర వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసి నాణ్య‌మైన విద్యుత్‌ను 24 గంట‌ల పాటు వ్య‌వ‌సాయానికి, ఇత‌ర రంగాల‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు. సంక్షేమంలో దేశానికే మార్గ‌ద‌ర్శిగా ఉన్నామ‌ని తెలిపారు. గ‌త సంవ‌త్స‌రం ఎఫ్‌సీఐకి భార‌త‌దేశం మొత్తం 45 శాతం ధాన్యం ఇస్తే.. కేవ‌లం తెలంగాణ రాష్ర్టం 55 శాతం ధాన్యం ఇచ్చింద‌ని తెలిపారు. ఇది తాను డ‌బ్బా కొట్ట‌డం లేదు. ఇది స్వ‌యంగా ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించింది అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. 2014లో త‌ల‌స‌రి ఆదాయం రూ. ఒక ల‌క్ష 12 వేలు.. ఐదారు సంవ‌త్స‌రాల్లో తెలంగాణ త‌ల‌సారి ఆదాయం రూ. 2 ల‌క్ష‌ల 28 వేలు. ఇది డ‌బుల్ అయింది. భార‌త‌దేశంలో త‌ల‌స‌రి ఆదాయంలో ఐదో స్థానంలో ఉన్నాం. ఆర్థిక ప్ర‌గ‌తిని సాధించామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభంతో భూ రికార్డుల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ నేటితో ప్రారంభ‌మైంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. భూ రిజిస్ర్టేష‌న్ల విష‌యంలో పాత రిజిస్ర్టేష‌న్ ఛార్జీలే వ‌ర్తిస్తాయ‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. రిజిస్ర్టేష‌న్ ఛార్జీల్లో ఒక్క పైసా కూడా పెంచ‌లేద‌న్నారు. ఈ పోర్ట‌ల్‌లో అక్ర‌మ రిజిస్ర్టేష‌న్ల‌కు తావు ఉండ‌ద‌న్నారు. రిజిస్ర్టేష‌న్ల కోసం పైర‌వీలు చేసే అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. మీ-సేవా, ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ్య‌క్తిగ‌తంగా కార్యాల‌యానికి వెళ్లి భూములు రిజిస్ర్టేష‌న్లు చేసుకోవ‌చ్చు అని తెలిపారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ న‌మూనా ప‌త్రాలు కూడా అందుబాటులో ఉన్నాయ‌న్నారు. న‌మూనా ప‌త్రాల ఆధారంగా ఎవ‌రికి వారే రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియ చేసుకోవ‌చ్చు. కొత్త‌గా జ‌రిగే క్ర‌య‌, విక్ర‌యాల రిజిస్ర్టేష‌న్ల ప్ర‌క్రియ 15 నిమిషాల్లోనే పూర్త‌వుతుంది. ఒక వేళ డాక్యుమెంట్ రైట‌ర్ల స‌హాయం కావాలంటే వాళ్లు అందుబాటులో ఉంటార‌ని చెప్పారు. డాక్యుమెంట్ రైట‌ర్లు గ‌తంలో లాగా ఎలా ప‌డితే అలా రుసుం వ‌సూలు చేసేందుకు వీల్లేద‌న్నారు. డాక్యుమెంట్ రైట‌ర్లు తీసుకోవాల్సిన రుసుం కూడా ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంద‌న్నారు. డాక్యుమెంట్ రైట‌ర్ల పేర్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్లు ప్ర‌క‌టిస్తార‌ని తెలిపారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో 99 శాతం సాంకేతిక స‌మ‌స్య‌లు రాకుండా రూప‌క‌ల్ప‌న చేశామ‌న్నారు. సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తితే వెంట‌నే ప‌రిష్క‌రించే బృందాలు అందుబాటులో ఉంటాయ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో మ్యుటేష‌న్ కోసం కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగేవాళ్లం. కార్యాల‌యాల చుట్టు తిరిగే క‌ర్మ ఇక‌పై ఉండ‌దు. రిజిస్ర్టేష‌న్ల కోసం పైర‌వీ చేసే అవ‌కాశం ఉండ‌దు. రైతుల‌కు ఇష్ట‌మున్న రోజు స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్రారంభంతో రాష్ర్టంలోని 570 ఎమ్మార్వో కార్యాల‌యాన్ని స‌బ్ రిజిస్ర్టార్ కార్యాల‌యాలుగా మారాయ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మూడేండ్ల కింద ధ‌ర‌ణి పోర్ట‌ల్ ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టిన‌ప్ప‌డు ఇది సాధ్య‌మైత‌దా? అని అనుకున్నారు. అంద‌రూ ఇబ్బందిప‌డ్డారు. సీఎస్, సీఎంవో కార్య‌ద‌ర్శులు, రెవెన్యూ అధికారులు మూడేళ్లు శ్ర‌మించి ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను రూప‌క‌ల్ప‌న చేశారు. దాదాపు 150 నుంచి 200 స‌మావేశాలు నిర్వ‌హించాం. భూరికార్డుల ప్ర‌క్షాళ‌న చేశాం. ఆ త‌ర్వాత మ‌ధ్యంత‌ర‌ ఎన్నిక‌ల‌కు పోయాం. మ‌ళ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ఆ కార్య‌క్ర‌మాన్ని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా దాన్ని కొన‌సాగించాం అని తెలిపారు. క‌రోనా వ‌ల్ల ఆరేడు నెల‌లు ఈ పోర్ట‌ల్ ఆల‌స్య‌మైంది అని సీఎం కేసీఆర్ చెప్పారు.

- Advertisement -