కొత్త సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్..

117
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత కొత్త సచివాలయం పనులను పరిశీలించారు. పనులు జరుతున్న తీరుపట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. నిర్మాణ పురోగతి ఊపందుకోవడంతో ఆర్ అండ్ బీ అధికారులను కూడా సీఎం అభినందించారు. సచివాలయ నిర్మాణంలో వినియోగించే వివిధ రాళ్లు, టైల్స్, ఇతర సామాగ్రిని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఎలివేషన్లో భాగంగా ఉండే రెడ్సాండ్ మార్బుల్ తో పాటు ఇన్నర్ ఫ్లోరింగ్, క్లాడింగ్ లకు సంబంధించిన నమూనాలను కొన్ని మార్పులు చేర్పులతో ఆమోదించారు. అన్నీ పనులు అనుకున్నట్లు జరిగితే ఈ దసరాకల్లా కొత్త సచివాలయం ఆపరేషన్లోకి వస్తుంది.

సమీకృత కొత్త సచివాలయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ముందు భాగంలో 4 అంతస్తులు, వెనక భాగంలో 6 అంతస్తుల స్లాబ్ పనులు పూర్తయ్యాయి. వెనుకవైపు ఇంకా ఒక అంతస్తు, ముందువైపు మరో 3 అంతస్తులకు స్లాబ్ పడాల్సి ఉంది. కింద భాగంలో ఇటుక పనులు కూడా సమాంతరంగా మొదలయ్యాయి. ఎలివేషన్, ఫ్లోరింగ్, క్లాడింగ్ పనులకు సంబంధించిన ప్యాటర్న్ లను ఆర్ అండ్ బీ అధికారాలు నిర్మాణ ప్రాంగణంలో కూర్పు చేసి ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం కేసీఆర్ కొన్ని మార్పులతో ఆమోదం తెలిపారు. ఇక సచివాలయం ఇన్నర్ ఫ్లోరింగ్ కోసం వెట్రిఫైడ్ టైల్స్ ను వినియోగించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన డిజైన్లను కూడా ఎగ్జిబిట్ చేశారు. వాటిలో కూడా కొన్ని నమూనాలను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. బిల్డింగ్ ఎలివేషన్లో భాగంగా వాడే రెడ్సాండ్ మార్బుల్ డిజైన్లు కూడా ఆమోదం పొందాయి.

సచివాలయం నిర్మాణ పనుల ప్రారంభ సమయంలో కరోనా కారణంగా కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్ ల నుంచి వచ్చిన కార్మికులు కరోనా భయంతో పనులు మానేసి వాళ్ళవాళ్ళ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఎన్నో వ్యయ ప్రయసాలకు ఓర్చి ప్రభుత్వం కార్మికులను వెనక్కి పిలిపించి పనులను పునరుద్ధరించింది. ఇక అక్టోబర్ 28, 2020 లో కొత్త సచివాలయం నిర్మాణం కోసం టెండర్లు ఖరారయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లొంజీ సమీకృత కొత్త సచివాలయం పనులను చేపట్టింది. ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మాణం పనులను పరిశీలించడం ఇది 3 వ సారి. గతంలో జనవరి 26 వ తేదీన, మార్చి 18 వ తేదీన, ఆగస్టు 7 వ తేదీల్లో సీఎం కేసీఆర్ కన్ స్ట్రక్షన్ సైట్ ను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అధికారులకు తగు సూచనలిచ్చారు. కారిడార్లు సహా గ్రౌండు ఫ్లోరు, మొదటి ఫ్లోర్లకు వెళ్లి తనిఖీ చేశారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతుండటంతో సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఆర్ అండ్ బీ అధికారులను అభినందించారు.

- Advertisement -