సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. వనపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ పైలాన్ ఆవిష్కరించారు. పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాల కోసం ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో భాగంగా తెలంగాణలోని మొత్తం 26,065 పాఠశాలలను ఈ పథకం కింద అభివృద్ధి చేస్తారు. తొలి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో పనులు జరుగుతాయి.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మన ఊరు మనబడి కార్యక్రమం ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని తెలిపారు. దీనికి వనపర్తి జిల్లా వేదికగా శ్రీకారం చుట్టాం. వనపర్తికి ఆ గౌరవం దక్కుతుంది. తామంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పైకి వచ్చిన వాళ్లమే అని పేర్కొన్నారు. మీ ముందు ఈ హోదాలో నిలబడ్డామంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఆ రోజు గురువులు చెప్పిన విద్యనే కారణం. భవిష్యత్‌లో చాలా చక్కటి వసతులు పాఠశాలల్లో నిర్మాణం కాబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల బోధన కూడా ప్రారంభం కాబోతుందన్నారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.