తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ 2.0ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన టీ హబ్ 2.0 ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశీలించారు. టీ హబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రత్యేకతలను అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్-2 ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్, ఐటీ ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఈ టీ హబ్ 2.0 కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో టీ-హబ్ 2 రూపుదిద్దుకుంది. 4,000లకు పైగా స్టార్టప్ లను ఇంక్యుబేట్ చేసే అవకాశం ఉంది.
స్టార్టప్స్, ఆంత్రప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్, వెంచర్ క్యాపటిలిస్ట్స్, మెంటార్స్ కార్యకలాపాలకు వేదిక అయ్యేలా ఈ రెండో టీ హబ్‌ను నిర్మించారు. అత్యున్నత ప్రమాణాలతో 276 కోట్ల రూపాయలతో నిర్మించిన టీ హబ్ 2.0 ని దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 5. 82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టి హబ్ 2.0ని నిర్మించారు. రెండు వేల స్టార్టప్‌లు పనిచేసుకునేలా ఫెసిలిటీస్ కల్పించారు.
మొదటి టీ హబ్‌ను 2015లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రారంభించారు. అయితే ఇంకా పెద్ద టీ హబ్ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. దాంతో ప్రతిష్టాత్మకమైన టీ హబ్ 2.0కు ప్లాన్ చేసింది. మొదటి టీ హబ్ కంటే రెండోది ఐదు రెట్లు పెద్దది. కొరియా కంపెనీ స్పేసెస్ టీ హబ్ 2.0 డిజైన్‌ను చేసింది. స్పేస్ షిప్ స్ఫూర్తితో డిజైన్ చేసిన ఈ బిల్డింగ్‌ను 10 అంతస్తులతో నిర్మించారు.