ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే (పంప్ చేసే) అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి,ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి హరీష్ రావుతో పాటు స్ధానిక గజ్వేల్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
గోదావరి నదిపై లక్ష్మి బ్యారేజి (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల (లిఫ్టుల) ద్వారా తరలించే నీరు 618 మీటర్ల అత్యధిక ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో పడతాయి. 15 టిఎంసిల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా సాగునీటి సౌకర్యం లేక వ్యవసాయం సరిగా సాగకుండా ఎడారిగా మారిన కరువు ప్రాంతాలకు నీరు చేరుతుంది.
అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కొండ పోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల సరిహద్దులో కొండ పోచమ్మ దేవాలయం ఉంటుంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం (మల్లన్న గుడి) ఉంటుంది. రెండు దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే దేవాలయాలు. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్‌కు మల్లన్న సాగర్ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్‌కు కొండ పోచమ్మ సాగర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు.
కొండ పోచమ్మకు ఈ ప్రాంతంలో లక్షల సంఖ్యలో భక్తులున్నారు. నిత్యం వచ్చి పూజలు చేస్తారు. తమను చల్లగా చూసే దేవతగా పేరుంది. కొండ పోచమ్మ సాగర్ కూడా ఈ ప్రాంత వ్యవసాయానికి, తాగునీటికి, ఇతర అవసరాలు కూడా తీర్చేదిగా ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ అమ్మవారి పేరు పెట్టారు.