ఇళ్లు లేని పేదలు ఉండద్దు…

211
CM KCR Explanation The Double Bed Room
- Advertisement -

రాజకీయ అవినీతికి తావు లేకుండా డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని…దేశంలో ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదని సీఎం తెలిపారు. అసెంబ్లీలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు.

ప్రజల ఆశలు వమ్ముకానియ్యమని…. ఎన్ని ఇబ్బందులు ఎదురైన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టితీరుతామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూం పథకం బాలారిష్టాలను అధిగమించి ముందుకు సాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు భావదారిద్ర్యంతో మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం ఇంటి నిర్మాణంపై అవాకులు,ఛవాకులు పేలడం సరికాదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి డబ్బు కోరత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను మూసివేసిందన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. పేపర్‌లో వచ్చే వార్తల ఆధారంగా అసెంబ్లీలో మాట్లాడటం సరికాదన్నారు. గ్రేటర్ పరిధిలో 650 ఎకరాలు….ఇళ్ల నిర్మాణానికి అందుబాటులో ఉందన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో ఆదార,బాధర లేదన్నారు. గతంలో అధికారులు పర్సంటేజీలు తీసుకునేవారని….వేల కోట్లు గోల్ మాల్‌ అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారాలనే పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఆలస్యమైన..రెండు తరాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. లబ్ది దారులపై రూపాయి భారం పడకుండా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం వైపు అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా చూస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు రూ.7 వేల కోట్లు ఇళ్ల నిర్మాణానికి ఖర్చుచేస్తే….తెలంగాణ ప్రభుత్వం రూ. 17,660 కోట్లు ఖర్చుచేస్తుందని సభకు తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. 2004నుంచి 2014 వరకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. అవినీతికి పాల్పడిన 225 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 122 మంది అధికారులు, 113 మంది దళారులు, రాజకీయ నేతలు, ఒక జడ్పీటీసీ, 3 ఎంపీటీసీలు, 14 మంది సర్పంచ్‌లు, 3 సింగిల్ విండో చైర్మన్లు అవినీతికి పాల్పడినట్లు అప్పటి ప్రభుత్వమే తేల్చిందన్నారు.

ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతిని బయటకు తేవాలని తాము అధికారంలోకి రాగానే 2014లో సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు. 1,94,519 మంది అనర్హులు ఇండ్లు పొందినట్లు తేలింది. ఇందులో 1 లక్షా 4 వేల మందికి 235.90 కోట్లు చెల్లించారని తెలిపారు. ఇక 512 మంది గృహ నిర్మాణ శాఖ అధికారులను ఏకంగా తమ ఉద్యోగాల నుంచి తొలగించారు. మరో 140 మందిని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. 122 మందిపై ఆరోపణలు రుజువై శిక్షలు పడ్డాయని చెప్పారు. 2.86 కోట్లను రికవరీ చేశారని పేర్కొన్నారు.

2 లక్షల 60 వేల ఇళ్లు మంజూరయ్యాయని 14,222 ఇండ్లకు టెండర్లు పిలిచామని… 1,217 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఇండ్ల నిర్మాణానికి నిధులు చెల్లిస్తున్నామని….టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు రూ. 369.48 కోట్లు చెల్లించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయిన తర్వాత రూ. 1,159. 85 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.. వాటిని కచ్చితంగా చెల్లిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఒక్కరూపాయి కూడా వృధా కాకుండా ఇండ్ల నిర్మాణం చేపడదామని విపక్షాలకు సూచించారు. ఇండ్ల నిర్మాణానికి కేంద్రం సాయం చేయటానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

- Advertisement -