లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది టీఆర్ఎస్. ఇప్పటికే కరీంనగర్ నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ నిజామాబాద్‌లోనూ భారీ బహిరంగసభ నిర్వహంచారు. ఇక మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేయనున్నారు గులాబీ బాస్.
ఈ నెల 28 నుండి 11 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. దాదాపు 20 సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూనే నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రాష్ర్టంలోనిర్వహించే ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 28న సభ ఎక్కడ అనేది కన్ఫామ్ కాలేదు. 29న నల్లగొండలో, 31న మహబూబ్ నగర్, ఏప్రిల్ 1న మహబూబాబాద్,ఖమ్మంలో సభలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
దీంతో పాటు మల్కాజిగిరి, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో రెండు సభలు నిర్వహించాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తంగా 14 నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 9 వరకు చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో రోడ్‌షోలను నిర్వహించనున్నారు. మొత్తంగా ఓ వైపు సీఎం కేసీఆర్ మరోవైపు కేటీఆర్ ప్రచారంతో తెలంగాణ హోరెత్తనుంది.