ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది- సీఎం

214
kcr
- Advertisement -

ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ల పోస్టులను వందకు వంద శాతం లోకల్ ట్రైబ్స్ కే రిజర్వు చేస్తూ ఇచ్చిన జీవోను (జీవో నెంబరు 3/2000) కొట్టివేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. న్యాయపరమైన, రాజ్యాంగ పరమైన అంశాలను అధ్యయనం చేసి వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు స్థానిక ట్రైబల్స్ కు చాలా అన్యాయం కలిగించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరుఫున న్యాయ పోరాటం చేయాలని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందిన స్థానికులకు అదే ప్రాంతంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించే విషయంలో 100 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది. దీనిపై కొందరు కోర్టుకెళ్లగా వివిధ దశల అనంతరం ఇటీవల సుప్రీంకోర్టు ఈ జీవోను కొట్టేసింది. సుప్రీం ఆదేశాల వల్ల స్థానిక ఎస్టీలకు నష్టం జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 1950 జనవరి 26కు ముందు నుంచి స్థానికంగా నివాసముంటున్న ఎస్టీలకు స్థానిక ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్ ఇచ్చే పద్ధతి ఉందని, దీనివల్ల ఎస్టీలు కొద్దో గొప్పో ప్రయోజనం పొందారని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఈ జీవోను కొట్టేయడం వల్ల ఎస్టీలు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోతారని వారు వివరించారు.

రాజ్యంగం కల్పించిన ప్రత్యేక హక్కులకు సుప్రీంకోర్టు తీర్పు భంగకరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయ పోరాటం చేయాలని అభ్యర్థించారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఎస్టీల రిజర్వేషన్ కొనసాగించడం సముచితమని అభిప్రాయపడ్డారు. సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రివ్యూ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. ఎస్టీల రిజర్వేషన్ సౌకర్యం యధావిధిగా కొనసాగేలా అవసరమైన వాదనలతో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీలకు రాజ్యాంగమే ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కల్పించిందని సిఎం చెప్పారు. వాటిని కాపాడే విషయంలో ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం స్పష్టం చేశారు.

- Advertisement -