పెట్రోల్ ధరలను కేంద్రమే పెంచింది….తగ్గించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదేనని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఆదివారం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్….కేంద్రం సెస్ తీసెస్తే 77కే లీటరు పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వస్తుందన్నారు.
కేంద్రం పెంచింది కొండంత.. తగ్గించింది పిసరంత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లుగా వ్యాట్ పైసా పెంచలేదు..అందువల్ల తగ్గించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.సెస్ రూపంలో 100 శాతం డబ్బులు వాళ్లే (కేంద్రం) తీసుకుంటున్నరు. రాజ్యాంగబద్ధంగా ట్యాక్స్ రూపంలో వస్తే రాష్ర్టాలకు 41 శాతం వాటా ఇవ్వాలి. దాన్ని ఎగ్గొట్టడానికి, రాష్ట్రాల నోరుగొట్టి మొత్తం కేంద్రమే తీసుకుంటున్నదన్నారు.
ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలికి పెడితే మెడకు.. మెడకు పెడితే కాలికన్నట్టు మెలికలు తిప్పుతున్నదని మండిపడ్డారు. ‘ఎంవోయూ చేస్తరు. ధాన్యం తీసుకోవడానికి నిరాకరిస్తరు. కన్ఫ్యూజ్ చేస్తరు అని విమర్శించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నరు. ఇది మంచిదికాదు. నేను కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్న. చాలా హుందాగా ఉండాలె. కేసీఆరే బాధ్యుడని హుజూరాబాద్‌లో మాట్లాడిండు. అన్నీ అబద్ధాలే. నేను అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే, అప్పుడు నేను చేసిన పనికి ఇప్పుడు ధరలు పెంచుతున్నాం అంటున్నారు.