తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అద్భుతమైన పనితీరుతో వినూత్నమైన రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రపథాన నిలపడానికి నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ను బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎకనామిక్స్ టైమ్స్ అనే పత్రిక ఎంపిక చేసింది. ఈ అవార్డును సీఎం కేసీఆర్‌కు అందిస్తున్నామని టైమ్స్ ఎండీ వినీత్ జైన్ ఈమేయిల్ ద్వారా సీఎం కేసీఆర్‌కు తెలిపారు. వచ్చే నెల 27వ తేదీన ముంబైలో జరిగే ఈ అవార్డు ప్రధానోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ను పాల్గొనాలని వినీత్ జైన్ ఆహ్వానించారు.
అయితే తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడంతో సీఎం కేసీఆర్ టైమ్స్ ఎండీ వినీత్ జైన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ అంగీకరించారు. ఈ అవార్డు తనకు వ్యక్తిగతంగా వచ్చినట్టుగా తాను భావించడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి ఈ అవార్డు వచ్చినట్టు తాను భావిస్తున్నానని, ఈ గుర్తింపు తెలంగాణ సమాజానికి వచ్చిన గుర్తింపుగా తాను భావిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూపుకు ఈ మేయిల్ ద్వారా సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతితో అగ్రపథాన దూసుకెళుతోంది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీఎస్‌ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక విధానంతో తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పడంతో రాష్ట్రంలో మంచి ఫలితాలు వచ్చాయని, దీని ద్వారా ఇప్పటికే 7000 పరిశ్రమలు అనుమతులు పొందాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
రాష్ట్రంలో పరిశ్రమల వల్ల చాలా మంది యువతకు ఉద్యోగాలు లభించాయని, పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చాయని వివరించారు సీఎం కేసీఆర్. ఎటువంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా, ఎవరూ ఇబ్బందిపడకుండా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చిన ఐటి పరిశ్రమలు కూడా రాష్ట్రాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాయన్నారు సీఎం కేసీఆర్.