పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారాయి: సీఎం కేసీఆర్

35
telangana cm

పట్టణ ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో పచ్చదనం – పరిశుభ్రత పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. పట్టణాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రతీ యేటా రూ. 148 కోట్లు విడుదల చేస్తున్నదని సీఎం చెప్పారు. జిహెచ్ఎంసి, ఇతర కార్పోరేషన్లకు అదనంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

“పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో, వాయు కాలుష్యంలో జీవించడం మంచిది కాదు. పట్టణాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నది. ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించే ఏర్పాటు జరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణాల్లో 2,802 సానిటేషన్ వెహికిల్స్ ఉన్నాయి. మరో 2,004 సానిటేషన్ వెహికిల్స్ ను సమకూరుస్తున్నాం. మొత్తం 4,806 సానిటేషన్ వెహికిల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నది. పట్టణ ప్రాంతాల్లో 1,018 నర్సరీలను, జిహెచ్ఎంసి లో 500 నర్సరీలను ఏర్పాటు చేయటం జరిగింది. అన్ని పట్టణాల్లో వైకుంఠధామాలు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. లక్ష జనాభాకు 1 చొప్పున వైకుంఠధామాలు నిర్మించాలి. దీని కోసం అవసరమైతే మున్సిపాలిటీల నిధులతో స్థలాలను కొనుగోలు చేయాలి. రాష్ట్రంలోని 116 పట్టణాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ (సమీకృత) మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నాం. జనాభా ఎక్కువ కలిగిన పట్టణాల్లో అదనంగా మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ఈ యేడాది బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చే ప్రజలు మరీ ముఖ్యంగా మహిళలు టాయిలెట్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలి. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి” అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.

మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మిగిలిపోయిన లబ్దిదారులకు వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు రెండు విడతలుగా గొర్రెల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే మొదటి విడత చివరలో కరోనా రావటంతో ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిందని సీఎం చెప్పారు. మొదటి విడతలో మిగిలిపోయిన 28 వేల మంది లబ్దిదారులకు గొర్రెల పంపిణీ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ యేడాది ప్రవేశపెట్టే బడ్జెట్ లో నిధులు కేటాయించి రెండవ విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సీఎం వివరించారు. అన్ని గ్రామాల్లో చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. చెరువుల రక్షణ కోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల రక్షణ కమిటీలను నియమించాలని చెప్పారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాతనే ఆయా శాఖల్లో ఏర్పడే ఖాళీల పై స్పష్టత వస్తుందని సీఎం చెప్పారు. జిల్లాల వారీగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. కారుణ్య నియామకాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. వలస పక్షుల వలనే బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్నదన్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేకున్నా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మంగళవారం సంబంధిత మంత్రులు, అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని, ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి ప్రశంసలు లభిస్తున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో మూడేళ్ళలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు సీఎం తెలిపారు. సామాజిక అడవుల పెంపకంతో పాటు అటవీ ప్రాంతాల్లో అడవుల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. కలప స్మగ్లింగ్ పూర్తిగా అరికట్టాలని, స్మగ్లర్ల పై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 చోట్ల అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి జరుగుతున్నదని, ఇంకా పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంచుతున్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పిసిసిఎఫ్ శోభా, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అటవీశాఖ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. 127 శాతం మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ప్రకటించిన ముఖ్యమంత్రి కలెక్టర్ శరత్ ను ప్రశంసించారు. 1.06 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అత్యధిక మొక్కలు నాటిన జిల్లాగా యాదాద్రి కొత్తగూడెం నిలిచిందని ప్రకటించిన ముఖ్యమంత్రి ఆ జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డిని అభినందించారు