రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు అన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం..రాష్ట్రంలో ఆక్రమణకు గురైన దేవాదాయ, వక్ఫ్ భూములను రక్షిస్తామని స్పష్టం చేశారు.భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా రేపటి నుంచే వక్ఫ్ భూముల్లో లావాదేవీలను నిషేధిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. 55 వేల ఎకరాల వక్ఫ్ భూమి ,87 వేల ఎకరాల దేవాదాయ భూములు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రంలో సాదా బైనామాలకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు పరిశీలిస్తామని తెలిపారు. పేదలను కాపాడటంలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలోఉందని తెలిపిన సీఎం… ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సాదా బైనామాలు చేపట్టాం అన్నారు.
ఎమ్మెల్యేల కోరిక మేరకు సాదా బైనామాలను గతంలో మూడు సార్లు పొడిగించాం. మరోసారి అవకాశం ఇవ్వాలని పలువురు సభ్యులు కోరారు. సభ్యుల కోరిక మేరకు మానవతా దృక్పథంతో ఆలోచిస్తాం అన్నారు.సాదా బైనామాల ప్రక్రియలో భాగంగా తమ ప్రభుత్వంలో 1,19,000 దరఖాస్తులు తీసుకుని 6,18,000 ఎకరాలకు ఉచితంగా క్రమబద్దీకరణ చేశామని సీఎం గుర్తు చేశారు.