హైదరాబాద్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండటంతో లాక్ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అమలు చేస్తున్న పద్ధతులను యథావిధిగా అమలు చేయాలని, లాక్ డౌన్ వల్ల ఏ ఒక్కరు ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలని ఆదేశించారు.
నిన్న ఒక్కరోజే హైదరాబాద్‌లో 31 కేసులు నమోదుకావడంతో ప్రజలు ఎవరినీ ఎట్టి పరిస్ధితుల్లో బయటకు రానీయవద్దని సూచించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను చర్చించారు.
కంటైన్మెంట్ల నిర్వహణ బాగా జరగాలి….ఎక్కడికక్కడ వ్యూహం రూపొందిచుకుని ముందుకు సాగాలన్నారు. ఎంత మందికైనా పరీక్షలు జరపడానికి, ఎంత మందికైనా చికిత్స చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.