జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కీలక గణంకాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా మారుతున్న ప్రజల జీవనశైలి, ఆరోగ్య ప్రమాణాలు మరియు సామాజిక మార్పులను ఈ సర్వే అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో సర్వేలో దేశంలో ఊబకాయంతో బాధపడే వారిసంఖ్య పెరిగిపోయిందని… పిల్లల్లో వ్యాధి నిరోధక టీకాల పంపిణీ మెరుగుపడటం మరియు బాల్య వివాహాలు తగ్గడం వంటి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో వయోజనులలో ఊబకాయం సమస్య గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా పెరుగుతోంది. పట్టణ ప్రాంతాలలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా శారీరక శ్రమ తగ్గడం, మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోనూ ఊబకాయం లేదా అధిక బరువు సమస్య ఎక్కువవుతున్నట్లు సర్వేలో తేలింది. ఇది భవిష్యత్తులో మధుమేహం , గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో శిశు ఆరోగ్య సంరక్షణ విభాగంలో సానుకూల మార్పులు నమోదయ్యాయి. ప్రభుత్వ పటిష్ట చర్యల వల్ల దేశవ్యాప్తంగా 12-23 నెలల వయస్సు గల పిల్లలకు పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు అందే రేటు గణనీయంగా మెరుగైంది. గత సర్వేలతో పోలిస్తే గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం విశేషం.
Also Read:మౌంట్ రష్‌మోర్‌పై ట్రంప్..!
భారతదేశంలో సామాజిక అవగాహన పెరగడం మరియు చట్టాల అమలు కారణంగా బాల్య వివాహాల శాతం మరింత తగ్గినట్లు NFHS-6 నివేదిక స్పష్టం చేసింది. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేసే సంప్రదాయం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో క్షీణించింది. అయితే, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలు లేదా జిల్లాలలో ఇప్పటికీ ఈ సమస్య పూర్తిగా సమూలంగా నిర్మూలించబడలేదని, వాటిపై మరింత దృష్టి పెట్టాలని నివేదిక సూచించింది.
ఇదే సమయంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని మహిళలు,ఐదేళ్ల లోపు పిల్లల్లో రక్తహీనత సమస్య ఇప్పటికీ ఒక ప్రధాన సవాలుగానే మిగిలి ఉందని సర్వే వెల్లడించింది.

