CJP:’పార్లమెంట్ చలో’..ఉద్రిక్తత

2
- Advertisement -

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘పార్లమెంట్ చలో’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి, యువజన, రైతు, కార్మిక, మహిళా, పౌరసంఘాలు, పలు సామాజిక సంస్థలు భారీగా తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల పరిరక్షణ, విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, పేపర్ లీక్‌లు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, సోనం వాంగ్‌చుక్ ఉద్యమానికి మద్దతు తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

పార్లమెంట్ వైపు కదిలిన నిరసనకారులను పోలీసులు జంతర్ మంతర్ సమీపంలోనే అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు పోలీసు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుందనే భావించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ర్యాలీని చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనాల్లో తరలించారు.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేశారు. పార్లమెంట్ భవనం, విజయ్ చౌక్, సెంట్రల్ విస్టా, జంతర్ మంతర్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు, మొత్తం 25 రోజులపాటు కొనసాగనున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

నిరసనలో పాల్గొన్న సంఘాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా జరిగిన NEET, UGC-NET తదితర పరీక్షల పేపర్ లీక్‌లపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థులకు న్యాయం జరిగేలా పారదర్శక పరీక్షా వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్ చేశాయి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను పరిరక్షించాలని, ఆ భూములను ఇతర అవసరాలకు వినియోగించకుండా ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిరసనకారులు కోరారు. విద్యార్థులు, ఉద్యమకారులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఉద్యమానికి కూడా మద్దతు తెలిపారు. లడఖ్‌కు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ (Sixth Schedule) హోదా కల్పించాలని, స్థానిక ప్రజల భూములు, ఉద్యోగాలకు రాజ్యాంగ పరిరక్షణ ఇవ్వాలని, హిమాలయ ప్రాంత పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని, లడఖ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.

Also Read:పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..అప్‌డేట్స్‌

జూలై 19న సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి విడుదల చేసిన చేతిరాత లేఖలో సోనం వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను జూలై 20న ముగిస్తానని, అయితే కొన్ని షరతులు నెరవేరితేనే దీక్ష విరమిస్తానని తెలిపారు. విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలు, ముఖ్యంగా పేపర్ లీక్‌లకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తే, లేదా తాను పార్లమెంట్ గుమ్మం వరకు చేరిన తర్వాత వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు ఈ అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని హామీ ఇస్తే, లేదా ఆరోగ్య పరిస్థితి కారణంగా తాను వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి వచ్చి అదే హామీ ఇస్తే తన దీక్షను ముగిస్తానని పేర్కొన్నారు.

తన లేఖలో సోనం వాంగ్‌చుక్ తాను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధంలో ఉన్నానని, తన స్వేచ్ఛగా సంచరించే హక్కు, మాట్లాడే హక్కు, ఇతరులతో కమ్యూనికేట్ చేసే హక్కులను పరిమితం చేశారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉద్యమాన్ని కొనసాగిస్తానని తెలిపారు.

- Advertisement -