భారత సుప్రీం కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ (ఎన్ వి రమణ) ఈ నెల 14వ తేదీన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు యాదగిరిగుట్టకు వస్తున్నారు. గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్, హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ తదితరులు ప్రధాన న్యాయమూర్తి వెంట రానున్నారు. శ్రీ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం నిర్మాణం పూర్తయిన ఈవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
తొలిసారిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి యాదాద్రి సందర్శన సందర్భంగా శనివారం జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, సీఎంవో ప్రధాన కార్యదర్శి భూపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి తదితరులు ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఘన స్వాగతం పలికేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్న విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, వైటీడీఏ అధికారులు తదితరులు వారి వెంట ఉన్నారు.