కేటీఆర్ తాను బెంచ్ మేట్స్ అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ యూసుఫ్‌గూడలో జరిగిన వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన చిరు..అసెంబ్లీలో కేటీఆర్ తానే ఒకే సమయంలో అడుగుపెట్టామని..కేటీఆర్ మృదుభాషి అన్నారు. మాటల తూటాలతో ప్రత్యర్థుల నోళ్లు మూయించే డైనమిజం ఉన్న మనిషని… అంతర్జాతీయ వేదికలపై అత్యద్భుతంగా మాట్లాడి సెభాష్ అనిపించుకున్నారు. డేరిం, డాషింగ్, డైనమిక్ అనే మూడు పదాలు కేటీఆర్ అనే మూడక్షరాలకు సరిగ్గా సరిపోతాయన్నారు.
వినయ విధేయ రామ ట్రైలర్ చూస్తూ… నా మనసులోనే సెభాష్ అనుకున్నానని తెలిపారు. కుటుంబాన్ని కాపాడుకునే యువకుడి పాత్రలో చరణ్ కనిపించాడు. పాత్ర పరంగా నేను చేసిన గ్యాంగ్ లీడర్ గుర్తొచ్చిందన్నారు చిరంజీవి.
రంగస్థలం తర్వాతత ఏం చేస్తే బాగుంటుందనే చర్చ వచ్చినప్పుడు బోయపాటి గుర్తొచ్చారు. ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా ఓ సినిమా ఆయనైతే బాగా చేయగలడు అనిపించింది. చరణ్ డైలాగులు, నటన, పోరాటాలు అన్నీ చక్కగా కుదిరాయి. దేవిశ్రీ పాటలు బాగున్నాయని తెలిపారు.
వారసత్వం అనేది అసమర్థుడికి బరువు. సమర్థుడికి ఓ బాధ్యత అన్నారు దర్శకుడు బోయపాటి. రాజకీయ రంగంలో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ రాణిస్తే, సినిమా రంగంలో చరణ్ జైత్ర యాత్ర కొనసాగిస్తున్నారు. ఓ సమర్థుడు నిలబడితే వందమందిని నిలబెడతాడు. దానికి నిదర్శనమే చిరంజీవి అన్నారు.