ఆదివారం జరిగిన 16 వ సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ వైభవంగా జరిగినా, మునుపటి ఉత్సాహం షో లో కనిపించలేదనే చెప్పాలి. ఒకప్పుడు సౌత్ ఇండియాలోని ప్రముఖ తారలందరూ ఏకమై ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా జరిగే సంతోషం అవార్డ్స్ ఈ సారి ఆహ్వానితులు కూడా ఎక్కువ మంది హాజరవ్వకపోవడంతో కొంత సందడి తగ్గింది. అయితే షో లో ముఖ్య పాత్ర పోషించిన మెగాస్టార్ చిరంజీవి, వేదికపై తనకొచ్చిన అవార్డు ను అందుకున్నప్పటికీ, తర్వాత ఆ పురస్కారాన్ని తిరస్కరించి చర్చలకు దారి తీసాడు.
మెగాస్టార్ ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా పోయిన ఏడాది రిలీజ్ అయినప్పటికీ , ఆ సినిమా సెన్సార్ కార్యక్రమాలు 2016 లోనే పూర్తయిపోయాయ్. కాగా 2017 సినిమా జాబితాలో ఆ సినిమాను చేర్చి అవార్డు ఇచ్చిన కారణంగా మెగా స్టార్ తనకి ఆ అవార్డు వద్దనుకున్నట్టు సమాచారం.
తాను ముందుగా సంతోషం అవార్డు సమర్పకుడు సురేష్ కొండేటితో మాట్లాడినప్పుడు తనకి అవార్డు ఇవ్వనంటేనే ఫంక్షన్ కి వస్తానని చెప్పినట్టు చిరు చెప్తున్నారు. తీరా ఫంక్షన్ కి వచ్చాక గాన కోకిల జానకి గారి చేత అవార్డు ఇప్పించడంతో కాదనలేక తీసుకున్నట్టు చిరు వివరించి సోషల్ మీడియాలో చర్చినీయాంశమయ్యారు .ఏది ఎలా ఉన్నా చిరంజీవి సన్నిహితుడైన సురేష్ కొండేటి కేవలం తనపై అభిమానంతో చిరుకి అవార్డు ఇచ్చాడనే విమర్శ రాకూడదని చిరు ఈ అవార్డు ని తిరస్కరించినట్టు తెలుస్తుంది.