గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ ఈరోజు మధ్యాహ్నం 12.20గంటలకు తుదిశ్వాస విడిచారు. వేణు మాధవ్ మృతిపట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వేణు మాధవ్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
వేణు మాధవ్ తనతో తొలిసారిగా మాస్టర్ సినిమాలో నటించాడని తెలిపారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని పాత్రలు తనకోసమే పుట్టాయా అనేలా నటించేవాడు. ఆ పాత్రకే వన్నె తీసుకొచ్చేవాడు . వయసులో చిన్నవాడు. సినీ పరిశ్రమలో తనకింకా బోలెడంత భవిష్యత్తు ఉందని అనుకుంటున్న సమయంలో దేవుడు చిన్నచూపు చూశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నానని తెలిపారు. మరోవైపు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి నుంచి వేణుమాధవ్ భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రేపు ఫిలిం ఛాంబర్ వద్ద ఉంచనున్నారు.