బ్రేకింగ్.. 5రోజులు సీబీఐ కస్టడీకి చిదంబరం

381
chidambaram
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది సీబీఐ కోర్టు. ఆయన్ను సీబీఐ కస్టడీకి అనుమతించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం. ఐదు రోజులు చిదంబరంను కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది. నేటి నుంచి ఈనెల 26 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నట్లు తెలిపారు. ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో నిన్న రాత్రి 9గంటలకు చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాత్రి అతన్ని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఉదయం ఆయన్ను సుమారు 3గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

అధికారులు అడిగిన ప్రశ్నలకు చిదంబరం మౌనంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సాయంత్రం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చింది. తమ విచారణలో చిదంబరం ఎలాంటి సమాధానాలు చెప్పడం లేదని.. దీంతో కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది సీబీఐ. మరోవైపు కోర్టు అనుమతితో తన వాదనలు వినిపించారు చిదంబరం… తాను సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్టు కోర్టుకు వివరించారు. తనకు విదేశీ బ్యాంకుల్లో ఎలాంటి ఖాతాలు లేవని.. తన కుమారుడికి విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. అవి కూడా ఆర్బీఐ అనుమతితోనే ఓపెన్ చేసిన ఖాతాలని తెలిపారు.

చిదంబరం తరపున న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. జూన్ 18 2018 నుంచి చిదంబరం బెయిల్ పైన బయట ఉన్న సమయం నుంచి ఏ ఒక్క రోజు సీబీఐ అధికారులు చిదంబరాన్ని విచారణకు పిలవలేదని న్యాయస్ధానానికి చెప్పారు. కేవలం ఇంద్రాణి ముఖర్జీ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారం చేసుకుని సిబిఐ అధికారులు చిదంబరం చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారని సిబాల్ కోర్టుకు తెలిపారు. ప్రతీరోజూ అరగంటపాటు కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం చిదంబరానికి కల్పించింది కోర్టు.

- Advertisement -