ఎస్బీఐలో విలీనమైన దాని అనుబంధ బ్యాంకుల చెక్బుక్కులకు జనవరి 1 నుంచి కాలం తీరిపోతున్నది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)లో విలీనమైన ఆరు బ్యాంకుల చెక్కులు ఈ నెల 31వ తేదీ తరువాత చెల్లుబాటు కావని ఎస్బిఐ పేర్కొంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్‌పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, భారతీయ మహిళా బ్యాంక్‌లకు చెందిన చెక్కులు ఈ నెల 31 తరువాత చెల్లుబాటు కావు.
ఈ బ్యాంకుల చెక్కుబుక్కులతో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మారుతుంది. ఈ ఆరు బ్యాంకులను ఎస్బిఐలో విలీనం చేసిన తరువాత సెప్టెంబర్ 30వ తేదీని చెక్కుబుక్కులు చెల్లుబాటుకు గడువుగా నిర్ణయించినప్పటికీ దానిని డిసెంబర్ 31 వరకూ పొడిగించారు. దీంతో వచ్చే నెల 1 నుంచి సదరు చెక్బుక్కులకు విలువ లేకుండా పోతుంది. విలీనం తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 1,300 శాఖల ఐఎఫ్ఎస్సీ కోడ్స్, పేర్లను ఎస్బీఐ మార్చివేసింది.
హైదరాబాద్‌తో సహా ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, లక్నో తదితర ప్రధాన నగరాల్లోని శాఖల పేర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్స్ మారాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిత నిధుల బదిలీ వ్యవస్థలో అన్ని బ్యాంక్ శాఖలు భాగస్వాములయ్యేందుకు ఏర్పరచినదే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్ (ఐఎఫ్ఎస్సీ). ఇందులో 11 అంకెలుగల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది.
ఆర్టీజీఎస్, నెఫ్ట్ లేదా ఐఎంపీఎస్ ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి నగదు బదిలీకి ఐఎఫ్ఎస్సీ కోడ్ అవసరం. ఇదిలావుంటే సమీప ఎస్బీఐ శాఖ వద్దకు వెళ్లిగానీ, బ్యాంక్ ఏటీఎం, మొబైల్ యాప్ వినియోగించిగానీ ఖాతాదారులు కొత్త చెక్‌బుక్కులను అందుకోవచ్చు.
www. onlinesbi.com ద్వారా నెట్ బ్యాంకింగ్ సేవలనూ పొందవచ్చు. పాత బ్యాంక్‌లోని యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లే చెల్లుబాటు అవుతాయి.