కొడంగల్ ఎమ్మెల్యే,టీటీడీపీ సీనియర్ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారం జోరందుకోవడంతో చంద్రబాబు అధ్యక్షతన టీటీడీపీ కీలక సమావేశం జరిగింది. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు…టీటీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రేవంత్‌తో పాటు ల్.రమణ, నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఉమామాధవరెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
చంద్రబాబు పిలుపు మేరకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వచ్చిన రేవంత్ రెడ్డికి అవమానం ఎదురైంది. ఈ సమావేశానికి వచ్చీ రాగానే, చంద్రబాబుకు నమస్కరించిన రేవంత్, “మీతో కొద్దిసేపు విడిగా మాట్లాడాలి” అని అనగా, అటువంటి అవసరం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. విడిగా ఎవరితోనూ సమావేశాలు అయ్యేది లేదని చంద్రబాబు స్పష్టం చేయడంతో ఇక చేసేదేమీ లేక, మిగతావారితో పాటే ఈ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. తప్పు చేస్తే క్రమశిక్షణా చర్యలుంటాయని, ముఖ్యంగా కార్యకర్తల్లో అయోమయం, గందరగోళానికి గురిచేసేలా మాటలు, చేష్టలను తాను సహించేది లేదని ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది
రేవంత్ ఎపిసోడ్‌ని పెండింగ్‌లో పెట్టిన చంద్రబాబు రేపు అమరావతిలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ విషయంపై ఎవరు మాట్లాడవద్దని సూచించారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌తో భేటీ కావడంతో ఆయన ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో పార్టీ మారనున్నట్టు వచ్చిన వార్తలను ఖండించని రేవంత్… ఏపీ టీడీపీ నేతలను ప్రత్యక్షంగా విమర్శించారు. టీటీడీపీ నేతలు సైతం రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.