రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జిహెచ్ఎంసి చందానగర్ డివిజన్ మున్సిపల్ కమిషనర్ ఎన్. సుధాంష్ పాల్గొన్నారు. కూకట్ పల్లి డిప్యూటి కమిషనర్ ప్రశాంతి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ఆయన చందానగర్ డివిజన్ లోని శుభోదయ కాలనీలో మొక్కలను నాటారు. తెలంగాణ ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచేందుకు చేపట్టిన హరిత హారం స్పూర్తిని తమ చందానగర్ డివిజన్‌లో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ సంకల్పం తెలంగాణకు హరితహారంలో తమ వంతు బాధ్యతగా, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో చందానగర్ డివిజన్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున మొక్కలు నాటినట్లు, వాటిని సంరక్షించే బాధ్యతలు కూడా చేపట్టినట్లు డిఎంసి సుధాంష్ తెలిపారు. దేశమంతా పచ్చదనంతో మురవాలని, పర్యావరణ పరిరక్షణకు ఎంపి సంతోష్ చేపట్టిన ఈ సంకల్పం విజయం సాధించాలని చందానగర్ డిప్యూటి మున్సిపల్ కమిషనర్ సుధాంష్ ఆశాభవం వ్యక్తం చేశారు.
ఎంపి సంతోష్ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి మన కాలనీలను మనం కాపాడుకుంటూ పర్యావరణనికి మేలు చేసేందుకు కృషి చేయాలని కోరారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఎన్. రవికిరణ్‌కు, డిప్యూటి కమిషనర్ వెంకన్న, ఛార్మినార్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.