Vemulawada: కోడెల సంరక్షణ చేపట్టాలి

8
- Advertisement -

కోడెలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో వేములవాడ రాజన్న గోశాలను పరిశీలించి మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు. కోడెల మరణానికి ప్రధాన కారణం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనే….మేము అధికారంలో ఉన్నప్పుడు గోశాలను ఎన్నడూ రాజకీయం చేయలేదు, చేసే తప్పంతా చేసి ఎదుటి వారిపై బురద జల్లేలా మంత్రి పరిస్థితి ఉంది. ఒక్కో రైతుకు రెండు కోడెలు ఇవ్వాల్సిన నిబంధనలను తుంగలో తొక్కి, తన సిఫారసు లెటర్ మీద గీసుకొండ రాంబాబుకు 60 కోడెలను ఇచ్చింది నిజం కాదా? 60 కోడెల్లో 49 కోడెలు మాయమైంది నిజం కాదా? అన్ని పత్రికల్లో, చానెళ్లలో వచ్చింది నిజం కాదా? దీనికంతటికి కారణం, అసలైన ముద్దాయి మంత్రి సురేఖనే అన్నారు.

మంత్రి చేసిన నిర్వాకం వల్ల డిసెంబర్ 1నుండి కోడెల పంపిణీ ఆపితే 500 ఉండాల్సిన స్థానంలో 1300కు చేరిన మాట వాస్తవం కాదా? …స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా కోడెలన్నీ వ్యాధులతో చనిపోతున్నాయని అంటున్నారు కానీ వెటర్నరీ డాక్టర్లు మాత్రం సరైన పోషక ఆహారం అందక చనిపోతున్నాయని అన్నారు. ఇలా సరైన పోషణ లేక కోడెలు చనిపోవడం చాలా బాధాకరం. రోజుకు 10 టన్నుల పశుగ్రాసం వస్తుందని అంటున్నారు కానీ రెండు టన్నులు కూడా గోశాలకు రావడం లేదు. మరి మిగిలిన గడ్డి ఎవరు మేస్తున్నారు? నెలకు రూ. 5లక్షల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? బీహార్ లో గడ్డి స్కాంలో మంత్రి ఇరుక్కునట్లే ఇక్కడ కూడా ఎవరో ఒకరు ఇరుక్కుంటారు అన్నారు.

జూన్ 15 నుండి ఆలయాన్ని మూసి వేస్తామని ప్రకటించి భక్తులను ఆగం చేశారు. రాజన్న సన్నిధికి నిత్యం 20 వేలకు పైగా భక్తులు వస్తుండగా కనీసం వారికి కూడా సరియైన వసతి సౌకర్యాలు కల్పించడం లేదు. గంట తరబడి నిరీక్షించి క్యూ లైన్ లోనే భక్తులు పడిపోతున్నా పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం తయారుచేసిన నమూనా చిత్రాలు, ప్లాన్ ఇంకా నడుస్తున్నాయి.దురదృష్టం ఏమిటంటే కోడెల మృతి పట్ల, గోశాల నిర్వహణ పట్ల మంత్రికి అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రావద్దు. వీరి చేతగానితనం, అసమర్థ పాలన వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా రాజన్న కోడెల సంరక్షణ సరిగ్గా చేపట్టాలి. రద్దీకి తగినట్లు సౌకర్యాలు కల్పించాలి. తక్షణమే సంబంధిత వారిపై చర్యలు తీసుకొని గడ్డి స్కాంలో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హరీశ్‌రావు

- Advertisement -