జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం సోమవారం ఉదయం నగరంలోని ఖైరతాబాద్ జోన్‌లో పర్యటించింది. హుమాయూన్ నగర్ కంటైన్మెంట్ జోన్‌ను సందర్శించిన కేంద్ర బృందం డయాబెటిక్, పెరాల్సిస్, బి పి, ఇతర అత్యవసర కేసులకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, ఇంటింటికి తిరిగి ప్రతి రోజు నిర్వహిస్తున్న ఫివర్ సర్వే, స్ప్రేయింగ్, స్పెషల్ శానిటేషన్ గురించి అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా కంటైన్మెంట్ జోన్ లోపలికి వెళ్లి, నిత్యావసరాలను సరఫరా చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ ఆయా అంశాలపై తీసుకున్న చర్యలు గురించి కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రభుత్వక్వారంటైన్ కేంద్రాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. అక్కడ ఉన్న వసతుల గురించి వాకబ్ చేశారు. అదే ఆవరణలో వున్న సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను కేంద్ర బృందం తనిఖీ చేసింది. అన్ని జిల్లాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు ఏవిధంగా మందులు సరఫరా చేస్తున్నారు, ట్రాన్స్‌పోర్టేషన్ అంశాల గురించి చర్చించారు. అలాగే కోవిడ్-19 పాజిటీవ్ కేసులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది వినియోగిస్తున్న వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్‌లు, ఒక సారి వినియోగించి పడవేసే బెడ్‌షీట్లు, టవల్స్, మాస్కుల నాణ్యతను పరిశీలించారు.
ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచిన వ్యక్తుల సేవలకై ఉపయోగిస్తున్న మెటిరీయల్‌ను ఏవిధంగా డిస్పోస్ చేస్తున్నారో అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్టాఫ్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. అత్యవసర మందుల నాణ్యతను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల చికిత్సకు అవసరమైన మెడిసిన్స్, రక్షణ పరికరాలు సమృద్దిగా ఉన్నాయని అధికారులు వివరించారు. అలాగే జిల్లా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవఖానాలకు ఇండెంట్ ప్రకారం మందులను ప్రత్యేక వాహనాల ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మలేరియా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తుగా మందులను, స్ర్పేయింగ్ మెటీరియల్‌ను అన్ని జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందంలో ప్రజారోగ్యశాఖ సీనియర్ వైద్యులు డా.చంద్రశేఖర్ గెడం, జాతీయ పోషకాహర సంస్థ డైరెక్టర్ డా.హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్.ఠాకూర్, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేదిలు ఉన్నారు. కేంద్ర బృందంతో పాటు జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్లు ఎన్.రవికిరణ్, ప్రావిణ్య ఈ పర్యటనలో పాల్గొన్నారు.