దేశానికే ఆదర్శంగా తెలంగాణ: మంత్రి కేటీఆర్‌

79
ktr

హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవన్‌లో వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం ఇండస్ట్రీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందు పవర్ హాలిడేలు ఇండస్ట్రీని ఇబ్బందులకు గురిచేసేవి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా..కొందరు పరిశ్రమల మనుగడ, అభివృద్ధిపై అనేక అనుమానాలు వెలిబుచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంట్ సమస్యను అధిగమించాం. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ 3లో ఉన్నది. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతో సాధ్యమైందని మంత్రి తెలిపారు.

రాష్ట్రం ఏర్పడ్డాక కరెంట్, లా అండ్ ఆర్డర్ సమస్యలను పరిష్కారించాం. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు దేశానికి ధాన్యగారంగా మారింది. మన దగ్గర ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదు. ఈరోజుల్లో ఏ అభివృద్ది సూచిక తీసుకున్న తెలంగాణ రాష్ట్రం మొదటి మూడు స్థానాల్లో స్థానం దక్కించుకుంటోంది. ప్రోగ్రెసివ్ స్టేట్‌గా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తోంది. విద్యుత్ సమస్యలు, శాంతి భద్రతలు, తాగునీటి సమస్యలు ఇలా అన్నింట మార్పు తీసుకొచ్చాం. పరిశ్రమలకు వేగవంత అనుమతులు, సెల్ఫ్ సర్టిఫికేషన్ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

హై స్పీడ్ రైల్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్, ఐటీ కారిడార్, హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ వంటి వాటిలో తెలంగాణ, దక్షిణ రాష్ట్రాలకు తగు ప్రాధాన్యం దక్కడం లేదు. దక్షిణ రాష్ట్రాలు, ప్రధాన నగరాల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ లను కేంద్రం అభివృద్ధి చేయాలి. ఇది సమగ్ర అభివృద్ధి అజెండా కాదు. తెలంగాణ రాష్ట్రం ప్రోగ్రెసివ్ పథకాలు, పురోభివృద్ధికి కేంద్రం నుంచి మన్ననలు తప్ప నిధులు, ప్రాజెక్టులు దక్కడం లేదన్నారు. హైదరాబాద్‌కు ఫార్మా సిటీ వస్తే.. నగరంతో పాటు రాష్ట్రంలో ఫార్మా ఎకోసిస్టమ్ బలపడుతుంది. వాక్సిన్ తయారీ కేంద్రాలు ఉన్న హైదరాబాద్‌లో వాక్సిన్ టెస్టింగ్ ల్యాబ్ ఉండదు. కనీస మౌలిక వసతులు కల్పించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.

రాష్ట్రం మెరుపు వేగంతో అభివృద్ధి పుంతలు తొక్కుతున్నా.. అందుకు తగ్గ ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం నుంచి అందటం లేదు. కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్బర్ ప్యాకేజితో ఎవరికి లబ్ది జరగలేదు. 20లక్షల కోట్ల ప్యాకేజీతో 20 మంది లబ్ది పొందలేదు. రాబోయే బడ్జెట్‌లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలి. బెటర్ మోడల్స్‌తో కూడిన పారిశ్రామిక రాయితీలు, అడిషనల్ ఇన్సెంటివ్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తాం. స్థానికులకు ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేసే పరిశ్రమలకు అదనపు రాయితీలు అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.