బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ నెమ్మదిగా ప్రపంచ దేశాలను కమ్మేస్తోంది. ఇప్పటి వరకు 30 దేశాలలో ఇది అడుగుపెట్టింది. ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్‌లో కూడా ప్రవేశించింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 29 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో యూకే నుంచి వచ్చే ప్రయాణికులపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు యూకే నుంచి వచ్చే వారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గర్శకాలను ప్రకటించింది.
బ్రిటన్ నుంచి భారత్ వచ్చే ప్రయాణీకులందరికీ కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. పరీక్షలకయ్యే ఖర్చులను సైతం ప్రయాణీకులే భరించల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయాణీకులను విమానంలోకి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కరోనా వైరస్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టును నిర్ధారించాలని, యూకే నుంచి వచ్చే ప్రయాణీకులందరూ భారత విమానాశ్రయాలకు చేరగానే తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. కరోనా నెగిటివ్ వచ్చినవారు సైతం 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని, ఈ నిబంధనలు జనవరి 30 వరకు అమల్లో ఉంటాయని చెప్పింది.
కాగా, కేంద్ర ప్రభుత్వం గత నెలలో యూకే విమాన సర్వీసులపై నిషేధం విధించింది. అయితే, ఈ నెల 6 నుంచి మళ్లీ విమాన సర్వీసులు పునరుద్ధరించనున్నట్లు పౌర విమానాయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ శుక్రవారం ప్రకటించారు. 6న భారత్ నుంచి యూకేకు తొలి ఫ్లైట్ నడువనుండగా.. 8న యూకే నుంచి భారత్‌కు ఫ్లైట్ రానుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిబంధనలు జారీ చేసింది.
మార్గదర్శకాలు ఇవే..
-యూకే నుంచి వచ్చే వారందరూ 72 గంటల ముందు ఆన్‌లైన్ పోర్టల్ https://www.newdelhiairport.inలో కొవిడ్ పరీక్షల్లో వచ్చిన నెగెటివ్ రిపోర్టు అందజేయాలి.
-ప్రయాణికుడిని విమానంలోకి ఎక్కడానికి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కొవిడ్ నెగిటివ్ రిపోర్ట్‌ను పరిశీలించాలి.
-ఆర్టీపీసీఆర్ టెస్ట్ లేదంటే.. టెస్ట్ జరిగిన తర్వాత ఫలితం కోసం చూసే వారి కోసం విమానాశ్రయంలో షెల్టర్, హెల్ప్ డెస్క్ కల్పించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.
-సదరు ప్రయాణికుడికి కొవిడ్ పాజిటివ్‌గా తేలితే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండే విధంగా చూడాలి. నెగెటివ్‌గా తేలేవరకూ ఐసోలేషన్‌లో ఉండాలి.
-కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన.. అటూ ఇటూ మూడు వరసల్లో ఉన్న ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి.
-ఎయిర్‌పోర్ట్‌లో నెగెటివ్‌గా తేలిన వ్యక్తి అధికారుల పర్యవేక్షణలో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి.