కరోనా.. రాష్ట్రానికి మరో 4 ప్రత్యేక బృందాలు..

163

లాక్​డౌన్​ మార్గదర్శకాలు అమలవుతున్న విధానం, సామాజిక దూరం అమలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, నిత్యావసరాల సరఫరా, వైద్య సిబ్బందికి భద్రత, సహాయ శిబిరాల్లో పరిస్థితిపై సమీక్ష చేసి నివేదిక ఇవ్వడానికి మరో 4 అంతర్​ మంత్రిత్వ శాఖల బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది.

రాష్ట్రాల్లో కరోనా వాస్తవాలను మదింపు చేసేందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేంద్ర బృందాల రాక పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రం క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తోంది. తాజాగా, తెలంగాణతో పాటు తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ బృందాల్లో పలు మంత్రిత్వ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ బృందాలకు అదనపు కార్యదర్శి హోదా ఉన్న అధికారులు నాయకత్వం వహిస్తారని, తెలంగాణలోని హైదరాబాద్ లో, గుజరాత్ లోని సూరత్ లో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఈ బృందాలు పర్యటిస్తాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాటైన ఆరు బృందాలకు ఇవి అదనం అని తెలిపారు.

ప్రధాన హాట్ స్పాట్లుగా గుర్తించిన జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోందని, హైదరాబాద్, సూరత్,అహ్మదాబాద్,చెన్నై,థాణే వంటి అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయని, వైద్య, పోలీసు సిబ్బంది పట్ల దాడులు జరుగుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.