ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం

53
bhadrachalam
- Advertisement -

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తెలంగాణ లోని గోదావరి తీరప్రాంత పరివాహాక ఏరియాలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా దెబ్బతిన్న పంటలు, ఇండ్లు, రహదారులకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది.

కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి నేతృత్వంలో పార్తిభన్‌ కె.మనోహరన్‌, కేంద్ర జలసంఘం డైరెక్టర్‌ రమేష్‌కుమార్‌, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎస్‌ఈ శివకుమార్‌ కుష్వాహల బృందం శుక్రవారం జిల్లాలోని బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి గూడెం, బూర్గంపాడు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమాలలో రాష్ట పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతం, ఐటీడీఏ పీవో గౌతం, ఏఎస్పీ రోహిత్ రాజ్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి మరియన్న, తదితరులు పాల్గొన్నారు.

సంజీవరెడ్డి పాలెం గ్రామంలో దెబ్బతిన్న పత్తి, పొలాలు, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తామన్నారు. అంతకు ముందు కేంద్ర బృందానికి ఐటీడీఏ కార్యాలయంలో పంట నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు.

- Advertisement -